Share News

చిటికెలోనే బ్యాంకింగ్‌ సేవలు

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:59 AM

డీసీసీబీలో యూపీఐ చెల్లింపుల ప్రక్రియ విజయవంతంగా ఇతర జిల్లాల్లోనూ అమలుకు మౌఖిక ఉత్తర్వులు

చిటికెలోనే బ్యాంకింగ్‌ సేవలు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో ప్రయోగాత్మకంగా చేపట్టిన యూపీఐ సేవలను రాష్ట్రమంతా అమలు చేయనున్నారు. ఇక్కడి డీసీసీబీ బ్రాంచ్‌ల్లోని సేవింగ్స్‌ ఖాతాదారులకు యూపీఐ ద్వారా నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి సేవలు మొబైల్‌ యాప్‌ ద్వారా అందుతున్నాయి. 2023-24లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈసేవలు రెండేళ్ళలో జిల్లా అంతటా విస్తరించి అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని డీసీసీ పరిధిలో 3.50 లక్షల మంది ఖాతాదారులున్నారు. వీరిలో కనీసం లక్షమందికి వచ్చే నెల 31 నాటికి యూపీఐ మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల పరిధిలోకి తీసుకుని రావాలని నిర్ణయించారు. ఈ మేరకు గతనెల చివరలో అమరావతిలోని ఆప్కాబ్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి డీసీసీబీ చైర్మన్ల సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ అమాస రాజశేఖర్‌ రెడ్డి ప్రతిపాదించారు. జిల్లాలో చేపట్టిన యూపీఐ సేవల గురించి ఆయన విపులంగా వివరించారు. దీంతో దీనిని రాష్ట్రంలోని మిగిలిన డీసీసీబీల్లో కూడా ఈ ప్రక్రియల అమలుచేయాలని ఆప్కాబ్‌ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. చిత్తూరు డీసీసీబీ పరిధిలో 40 అనుబంధ శాఖలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అన్ని వాణిజ్య బ్యాంకుల తరహాలో ఖాతాదారులకు పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి సేవలు అమలవుతున్నాయి. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక లావాదేవీలు నగదురూపేణ కాకుండా డిజిటల్‌ పద్ధతిలో జరిపేందుకు ఖాతాదారులు అలవాటు పడుతున్నారు. బ్యాంకు సీఈవో శంకర్‌ బాబు మాట్లాడుతూ డీసీసీబీలో రెండేళ్ళుగా అమలవుతున్న యూపీఐ సేవలకు ఖాతాదారులంతా అలవాటు పడ్డారన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 12:59 AM