ఇనగలూరు ఇండస్ట్రియల్ పార్కు పరిధిలో ఐలా
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:53 AM
ఇండస్ట్రియల్ పార్కు పరిధిలో ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది
తిరుపతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు ఇండస్ట్రియల్ పార్కు పరిధిలో ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇనగలూరు పంచాయతీ పరిధిలో మొత్తం 307.54 ఎకరాల పరిధిలో ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసింది. దీని పరిధిలో అవసరమైన సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా పంచాయతీ అధికారాలను ఏపీఐఐసీకి కేటాయించాలని సంబంధిత కార్పొరేషన్ ఎండీ 2024 డిసెంబరు 3న ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖల నడుమ ఉత్తరప్రత్యుత్తరాలు నడిచి, అవసరమైన నివేదికల సమర్పణ, పంచాయతీ తీర్మానాలతో అంగీకారాలు కుదిరాక అంతిమంగా ప్రభుత్వం మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఇనగలూరు పంచాయతీ పరిధిలో 307 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ పార్కులో పంచాయతీ అధికారాలు, విధులు ఏపీఐఐసీకి బదిలీ అయ్యాయి. అలాగే ఇండస్ట్రియల్ పార్కులో పంచాయతీ తరహా అధికారాలు, విధులు నిర్వర్తించడానికి వీలుగా ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అఽథారిటీ ఏర్పాటు చేస్తారు. ఐలాకు వచ్చే ఆదాయంలో పంచాయతీ, ఐలా చెరి సగం పొందుతాయి.