లారీ అతివేగానికి ఆటోడ్రైవర్ బలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:48 AM
ఓ లారీ అతివేగంగా ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు.
పుత్తూరు, నవంబరు12(ఆంఽధ్రజ్యోతి): ఓ లారీ అతివేగంగా ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆటోలోని ముగ్గురు నర్సింగ్ విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి.పుత్తూరు సమీపంలోని పరమేశ్వరమంగళం దగ్గర గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలతో చదువుకుంటున్న నర్సింగ్ విద్యార్థినులు అన్నా గౌరి వైద్య కళాశాలలో శిక్షణ తీసుకుంటున్నారు. కళాశాల ముగిసిన తర్వాత 17 మంది విద్యార్థినులు ఆటోలో పుత్తూరుకు వస్తున్నారు. పరమేశ్వరమంగళం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఆటోను వేగంగా ఢీకొంది. ఆటో నుజ్జునుజ్జవడంతో డ్రైవర్ బాలకృష్ణ(35) ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. విద్యార్థినులు తేజస్విని, రక్షిత, జ్యోతికలకు తీవ్ర గాయాలయ్యాయి.ఆటో డ్రైవర్ మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన విద్యార్థినులను తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. బాలకృష్ణ మరణ వార్త విని అతడి భార్య కౌసల్య, కుటుంబసభ్యులు, ఇద్దరు పిల్లలు నివాసముంటున్న మరాఠీ రైల్వే గేటు నుంచి ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించారు.
రహదారి నిర్మాణ పనుల ఆలస్యంతో ప్రమాదాలు
చెన్నై- రేణిగుంట ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణపనులు నత్త నడకన సాగుతున్నాయి. అక్కడక్కడా పనులు చేపడుతున్నందున ఆ రహదారిలో వాహనాలు ఎదురెదురుగా రాకపోకలు సాగిస్తుంటాయి.ఈ రహదారిలో ప్రైవేటు ఆపరేటర్ల సర్వీసులు, ఆటోలు పోటీలు పడుతూ పరుగులు తీస్తుంటాయి. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాల అతివేగాన్ని తగ్గించేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
క్షతగాత్రుల్లో ఒకరు డిశ్చార్జ్
తిరుపతి సెంట్రల్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పుత్తూరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినుల్లో రక్షిత ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జి చేశారు. మిగిలిన ఇద్దరికి రుయాలోని అత్యవసర విభాగంలో వైద్య సేవలందిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించి డీఎంహెచ్‌వోను, ఆర్ఐవోను, రుయా సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేశారు.దీంతో ముగ్గురు విద్యార్థినులను రుయాకు తీసుకొచ్చారు.వీరిలో తేజేశ్వరికి తలపై బలమైన గాయాలు కావడంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా వుందని రుయా క్యాజువాలిటీ మెడికల్ అధికారి చెప్పారు. జ్యోతికి చికిత్స అందిస్తున్నారు.