Share News

బిందు సేద్యానికీ ఆటోమేషన్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:34 AM

ఎక్కడి నుంచైనా బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను ఆపరేట్‌ చేయొచ్చు. కరెంటు రాగానే ఇల్లు లేదా బయట ప్రాంతాల్లో ఉన్నా ఆన్‌ చేయొచ్చు. నిర్ణీత సమయంలో పారుదల పూర్తవుతుందని భావించి ఆఫ్‌ చేయొచ్చు. ఇలా ఆటోమేషన్‌ యూనిట్‌ అందుబాటులోకి వచ్చింది.

బిందు సేద్యానికీ ఆటోమేషన్‌
రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బిందు సేద్యం యూనిట్‌

తొలిసారిగా జిల్లాలో ప్రారంభించినున్న సీఎం చంద్రబాబు

కొత్త యూనిట్‌పై 55, 45 శాతం వరకు రాయితీ

ఎక్కడి నుంచైనా బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను ఆపరేట్‌ చేయొచ్చు. కరెంటు రాగానే ఇల్లు లేదా బయట ప్రాంతాల్లో ఉన్నా ఆన్‌ చేయొచ్చు. నిర్ణీత సమయంలో పారుదల పూర్తవుతుందని భావించి ఆఫ్‌ చేయొచ్చు. ఇలా ఆటోమేషన్‌ యూనిట్‌ అందుబాటులోకి వచ్చింది. వీటిని ఈ నెలాఖరులో జరిగే కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాయితీ ద్వారా ఈ ఆటోమేషన్‌ యూనిట్లను రైతులు పొందవచ్చు.

- చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

ఉద్యానవన పంటలకు రైతులు ఇప్పటికే బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీటికి ఆటోమేషన్‌ అనే మరో యూనిట్‌ను అనుసంధానం చేస్తారు. ఇందులో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆయా రైతుల సెల్‌ఫోన్లకు కనెక్ట్‌ చేస్తారు. వీటిని ఎలా మొబైల్‌ ద్వారా ఆపరేట్‌ చేసుకోవచ్చనేది యూనిట్‌ను ఇన్‌స్టాల్‌ చేసే కంపెనీలు రైతులకు అవగాహన కల్పించనున్నాయి. ఆ ప్రకారం.. రైతులు తమ మొబైల్‌ నుంచి ఆన్‌ చేయగానే తొలుత ఆటోమేషన్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఇది ఎంత సమయం పనిచేయాలి? ఎంత నీటిని సరఫరా చేయాలనే కమాండ్‌ను తీసుకుని, బిందు సేద్యం యూనిట్‌కు పంపుతుంది. ఆ ప్రకారం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలకు నీరు పెట్టవచ్చు. దీనివల్ల రైతు ప్రతి సారి పొలానికి వెళ్లే ప్రయాస తప్పుతుంది. కరెంటు రాగానే ఇంటి నుంచి లేదా ఇతర అవసరాలకు ఊరెళ్లినా అక్కడ్నుంచే బిందు, తుంపర్ల సేద్య యూనిట్లను ఆపరేట్‌ చేసి పంటకు నీరు పెట్టొచ్చు. తద్వారా ఊరెళ్లిన రైతులు పంటలకు నీరు పెట్టే విషయంలో ఎవరిపైనా ఆధారపడాల్సిన పని ఉండదు. మరోవైపు రాత్రి వేళ్లల్లో పొలాలకు వెళ్లే అవసరం లేకపోవడంతో విషపురుగులు, పాముకాటు నుంచి తప్పించుకోవచ్చు. ఎంత సమయం పనిచేయాలో నిర్ణయించుకునే వీలుండటం వల్ల అవసరమైన నీళ్లు మాత్రమే పంటలకు వదలొచ్చు. దీంతో నీటి వృథాను అరికట్టొచ్చు.

ఇప్పటికే 3.30 లక్షల ఎకరాలకు బిందు సేద్యం

ఏపీఎంఐపీ ద్వారా జిల్లాలో ప్రస్తుతం 3.30 లక్షల ఎకరాల్లో 50 వేల మంది రైతులు బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు వినియోగిస్తున్నారు. వీరిలో 2.5 ఎకరాల్లో సాగు చేసుకునే చిన్న సన్నకారు రైతులకు ఆటోమేషన్‌ యూనిట్లు 55 శాతం రాయితీపై.. మిగతా రైతులకు 45 శాతం రాయితీపై ఇస్తారు.

30 వేల ఎకరాలు లక్ష్యంగా..

జిల్లాలో తొలిసారిగా చేపట్టనున్న ఆటోమేషన్‌ బిందు సేద్యాన్ని ఫిబ్రవరి నెలాఖరులో జిల్లాలో 30 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను రైతులకు 90 శాతం సబ్సిడీతో అందజేస్తున్నారు. దీంతో పాటు ఆటోమేషన్‌ను సైతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. యూనిట్‌ విలువ రూ.40 వేలు కాగా చిన్న సన్నకారు రైతాంగానికి గరిష్ఠ రాయితీ కింద రూ.22 వేలు, ఇతర రైతులకు గరిష్ఠ రాయితీ కింద రూ.18 వేలు ఇవ్వనున్నారు.

ఉద్యాన రైతులకు మరింత ప్రయోజనకరం

ఆటోమేషన్‌ యూనిట్లు బిందు, తుంపర్ల సేద్యం చేసే ఉద్యాన రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చనుంది. ఆటోమేషన్‌ యూనిట్ల కోసం రైతు సేవా కేంద్రాల్లోనూ, స్థానిక ఉద్యానవన శాఖ కార్యాలయంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి పత్రాలు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు జత చేయాలి. ఇప్పటికే బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లున్న రైతులూ ఆటోమేషన్‌ యూనిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

- పీవీ రమణ, పీడీ, ఏపీఎంఐపీ

Updated Date - Jan 28 , 2026 | 01:34 AM