ఏటీఎం కేంద్రంలో నగదు చోరీకి యత్నం
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:51 AM
ముసుగు ధరించి ఉన్న గుర్తు తెలియని ఓ దుండగుడు ఏటీఎం కేంద్రంలో నగదు చోరీకి యత్నించాడు. సమ్మెటతో ఏటీఎం యంత్రంలో ఇనుపమేకు దింపి ఈ ఘటనకు పాల్పడ్డాడు.
- యంత్రంలో ఇనుపమేకు దింపిన వైనం
- స్థానికులు కనుగొనడంతో దుండగుడు పరారీ
మదనపల్లె క్రైం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ముసుగు ధరించి ఉన్న గుర్తు తెలియని ఓ దుండగుడు ఏటీఎం కేంద్రంలో నగదు చోరీకి యత్నించాడు. సమ్మెటతో ఏటీఎం యంత్రంలో ఇనుపమేకు దింపి ఈ ఘటనకు పాల్పడ్డాడు. స్థానికులు కనుగొనడంతో పరారయ్యాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక బెంగళూరు రోడ్డులోని నక్కలదిన్నెలో ఉన్న ఇండియా ఏటీఎం కేంద్రంలోకి ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో ముసుగు ధరించి ఉన్న ఓ దుండగుడు ప్రవేశించాడు. పథకం ప్రకారం వెంట సమ్మెట, ఇనుప మేకులు తీసుకెళ్లాడు. కేంద్రానికి అమర్చి ఉన్న గ్లాస్ డోర్ క్లోజ్ చేసి సమ్మెటతో యంత్రంలోకి ఇనుపమేకు దింపాడు. సమ్మెట శబ్ధానికి స్థానికులు ఏటీఎం కేంద్రం వద్దకెళ్లి చూడగా దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికులను విచారించారు. క్లూస్‌టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగుడు అక్కడే విడిచిపెట్టి వెళ్లిన సమ్మెట, ఇనుప మేకులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో అదే మార్గంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని గుర్తుతెలియని దుండగులు గ్యాస్‌కట్టర్‌తో కట్ చేసి అందులోని నగదుతో పారిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, నగదు రికవరీ చేశారు. తాజాగా దానికి ఎదురుగా ఉన్న ఇండియా ఏటీఎం కేంద్రంలో యంత్రాన్ని పగులగొట్టి నగదు చోరీకి యత్నించడంతో స్థానికులు భయాందోళన చెందారు. యంత్రంలో నగదు భద్రంగా ఉన్నట్లు ఏటీఎం కేంద్రాల మేనేజ్మెంట్ అధికారులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్‌కుమార్ చెప్పారు.