హెడ్‌కానిస్టేబుల్‌పై హత్యాయత్నం
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:55 AM
హెడ్‌కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ రవిమనోహరాచారి వెల్లడించారు
శ్రీకాళహస్తి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి):హెడ్‌కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ రవిమనోహరాచారి వెల్లడించారు. శ్రీకాళహస్తిలో మంగళవారం సాయంత్రం హెడ్‌కానిస్టేబుల్ రమణయ్యపై కత్తితో ఓ యువకుడు దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.ఈ కేసులో శ్రీనివాసులు(22), జితేంద్ర(20)లను బుధవారం అరెస్టు చూపారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్టకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాసులు(22), కైకాలవీధికి చెందిన బీటెక్ విద్యార్థి జితేంద్రకుమార్(20) పరిచయస్తులు.మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్లో ఓ ప్రయాణికుడి ల్యాప్‌ట్యాప్ చోరీకి గురైనట్లు డయల్ 112కు ఫిర్యాదు రావడంతో విచారణ కోసం హెడ్‌కానిస్టేబుల్ రమణయ్య రైల్వేస్టేషన్‌కు బయలుదేరాడు.అదే సమయంలో రైల్వేస్టేషన్ ప్రవేశ ఆర్చి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక మహిళ గాయపడింది. ఇది గమనించిన హెడ్‌కానిస్టేబుల్ రమణయ్య గాయపడిన బుజ్జమ్మను, ఆమె భర్త మునిచంద్రను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారి కావడంతో ద్విచక్ర వాహనాలు రోడ్డుపై ఉన్న కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రమణయ్య ఓ ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీశాడు. రెండవ ద్విచక్ర వాహన తాళాలను తీసుకుని దానిపై ప్రయాణిస్తున్న శ్రీనివాసులును, జితేంద్రకుమార్‌ను స్టేషన్‌కు రావాల్సిందిగా సూచించాడు. దీంతో శ్రీనివాసులు హెడ్‌కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డాడు.అంతేకాకుండా నడుము వద్ద దాచుకున్న కత్తిని బయటకు తీసి పొడవబోయాడు.హెడ్‌కానిస్టేబుల్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.ఆయన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి శ్రీనివాసులును,జితేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ వివరించారు. కాగా శ్రీనివాసులును బేడీలతో శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన వీధుల్లో బుధవారం ఊరేగింపుగా స్టేషన్‌కు తరలించడం చర్చనీయాంశమైంది.