ప్రియుడితో కలసి భర్తపై హత్యాయత్నం
ABN , Publish Date - Aug 01 , 2026 | 02:23 AM
ప్రియుడితో కలసి భర్తపై రోకలిబండతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కురబలకోట మండలం కోటవీధికి చెందిన టి.రఘునాథ్(52) లారీడ్రైవర్. అతని భార్య వనజ కొన్ని రోజులుగా గాలివీడు మండలం గొట్టివీడుకు చెందిన రామ్మోహన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
చనిపోయాడని రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయిన వైనం
స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో తప్పిన ప్రాణాపాయం
మదనపల్లె క్రైం, జూలై 31(ఆంధ్రజ్యోతి): ప్రియుడితో కలసి భర్తపై రోకలిబండతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కురబలకోట మండలం కోటవీధికి చెందిన టి.రఘునాథ్(52) లారీడ్రైవర్. అతని భార్య వనజ కొన్ని రోజులుగా గాలివీడు మండలం గొట్టివీడుకు చెందిన రామ్మోహన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితం ఆమె అలిగి పుట్టిల్లు అయిన గుర్రంకొండ మండలం రామాపురానికి వెళ్లిపోయింది. రఘునాథ్ భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు గురువారం రాత్రి అత్తారింటికి వెళ్లాడు. అక్కడ రామ్మోహన్, వనజ, ఆమె తండ్రి శ్రీనివాసులు కలసి రఘునాథ్‌తో గొడవ పెట్టుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పథకం ప్రకారం రోకలిబండతో మూకుమ్మడిగా రఘునాథ్‌పై దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చనిపోయాడు అనుకుని ఆటోలో తీసుకెళ్లి గుర్రంకొండ టమోటా మార్కెట్‌యార్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. సమాచారం అందుకున్న గుర్రంకొండ ఎస్‌ఐ రవీంద్ర సిబ్బందితో కలసి ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. అనంతరం ఘటనపై ఆరా తీసి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. భార్య, ప్రియుడు, ఆమె తండ్రి కలసి తనను హతమార్చే ప్రయత్నం చేశారని పోలీసులకు చెప్పాడు. రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న తనను స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వారి ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.