Share News

అట్టహాసంగా బౌల్డరింగ్‌ ఫెస్టివల్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:41 AM

కుప్పం నియోజకవర్గాన్ని పర్యాటక స్వర్గధామంగా మార్చడంలో భాగంగా కంగుందిలో నిర్వహిస్తున్న బౌల్డరింగ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా సాగుతోంది.

అట్టహాసంగా బౌల్డరింగ్‌ ఫెస్టివల్‌
కంగుంది దుర్గం

కుప్పం, జనవరి 7 (ఆంరఽధజ్యోతి): కుప్పం నియోజకవర్గాన్ని పర్యాటక స్వర్గధామంగా మార్చడంలో భాగంగా కంగుందిలో నిర్వహిస్తున్న బౌల్డరింగ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా సాగుతోంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కూడలిలో గల కుప్పం నియోజకవర్గంలో ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ఆరామాలు, గలగల పారే జలపాతాలు, ఆకాశాన్ని తాకే కొండలు... పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని వనరులున్నా సరైన ప్రచారమూ, తగిన మౌలిక సదుపాయాలు, సన్నద్ధత లేకపోవడంతో కుప్పంపై పర్యాటకుల దృష్టి ఇంతవరకూ పడలేదు. ఈ లోపాన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన కంగుంది గ్రామాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. కంగుంది దుర్గం పాదాల చెంత, మల్లేశ్వరస్వామిసన్నిధిలో బౌల్డరింగ్‌ ఫెస్టివల్‌కు కడా ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకారం చుట్టారు. దుర్గానికి చెంతనే ఎదురుగా ఒక చిన్న గుట్టను ఎంచుకుని బౌల్డరింగ్‌ రింగ్‌ను ఏర్పాటు చేశారు. స్థానికులకు ఈ విషయంలో అనుభవం లేదు కాబట్టి తదేకం ఫౌండేషన్‌ ఫెస్టివల్‌ నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తోంది. పర్వతారోహణ కార్యక్రమాన్ని, ర్యాప్లింగ్‌ క్రీడను కూడా ఈ ఫెస్టివల్‌లో చేర్చారు. ఎత్తైన కొండనుంచి జాలువారే జలపాతాల వెంట పైనుంచి కిందికి దిగడమనే సాహసోపేత క్రీడనే ర్యాప్లింగ్‌ అంటారు. చెలిమిచేను జలపాతం వద్ద బుధవారం కొంతమంది సాహసులు ఈ ర్యాప్లింగ్‌ క్రీడలో పాల్గొన్నారు. తదేకం ఫౌండేషన్‌ నిర్వహణలో కంగుందిలో ఏర్పాటు చేసిన హోమ్‌ స్టేలో దేశ, విదేశాలనుంచి వచ్చిన పర్యాటక ప్రతినిధులు, క్రీడాసక్తి కలిగిన సాహసికులు సుమారు నెల రోజులనుంచి ఉంటున్నారు. వీరి ద్వారా తగినంత ఆదాయం కూడా సమకూరిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కంగుందిలోని ఇళ్ల గోడలపై అందమైన చిత్రాలను చిత్రించి గ్రామానికి శోభను తీసుకువచ్చారు. రాక్‌ క్లైంబింగ్‌, వైల్‌ లైఫ్‌ నైట్‌ ట్రెక్స్‌, టెంటెడ్‌ క్యాంప్‌, బాన్‌ ఫైర్‌ అండ్‌ మ్యూజిక్‌, ఇండోర్‌ బౌల్డరింగ్‌ జిమ్‌, ఫ్లవర్‌ అండ్‌ కోకోనట్‌ ఫెస్ట్‌ వంటి ఈవెంట్లు బౌల్డరింగ్‌ ఫెస్టివల్‌తోపాటు కొనసాగుతున్నాయి.ఈనెల 11వ తేదీన ముగియనున్న బౌల్డరింగ్‌ ఫెస్ట్‌ను తిలకించేందుకు శుక్రవారం మంత్రులు రాంప్రసాద్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్‌ వస్తారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌.మునిరత్నం, రాజశేఖర్‌ తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని, తద్వారా యువతకు క్రీడాసక్తితోపాటు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారని తెలిపారు. ఇందులో భాగంగానే బౌల్డరింగ్‌ ఫెస్ట్‌ను కంగుందిలో నిర్వహిస్తున్నారన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:41 AM