మహిళా న్యాయవాదిపై దాడి
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:49 AM
పుంగనూరు కోర్టులో జడ్జి ముందే మహిళా న్యాయవాదిని దూషించిన ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేయగా నిందితుడు బుధవారం ఆమెపై దాడి చేశాడు.
నేడు పుంగనూరులో న్యాయవాదుల సమ్మె
పుంగనూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): పుంగనూరు కోర్టులో జడ్జి ముందే మహిళా న్యాయవాదిని దూషించిన ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేయగా నిందితుడు బుధవారం ఆమెపై దాడి చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పుంగనూరు మండలం కుమ్మరిగుంటకు చెందిన న్యాయవాది గాయత్రికి, అదే గ్రామానికి చెందిన శ్రీరాములుతో భూ తగాదాలున్నాయి. ఈనెల 27వ తేదీ కోర్టులో వాయిదాకు రాగా శ్రీరాములు మద్యం మత్తులో ఆమెను దూషించాడు. జడ్జి ఆదేశాల మేరకు శ్రీరాములుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగ్రహించిన నిందితుడు, కుటుంబీకులు లాయర్ ఇంటిపై దాడి చేసి, ఆమెను కొట్టి గాయపరిచారు. కుటుంబీకులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్ప త్రికి తరలించారు. విషయం తెలుసుకున్న న్యాయవాదులు ఆమెను పరామర్శించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ గురువారం పుంగనూరు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయకుమార్ తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.