గుర్రంకొండ సొసైటీలో... నిధుల గోల్‌మాల్..!
ABN , Publish Date - Oct 09 , 2026 | 02:04 AM
గుర్రంకొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో)లో ‘బంగారు సొమ్ములు’ స్వాహా అయ్యాయి. రూ.50లక్షలు స్వాహా చేసిన సీఈవో అనిల్‌కుమార్ కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారు. తాకట్టు బంగారాన్ని విడిపించుకున్న కస్టమర్లు చెల్లించిన సొమ్మును బ్యాంకు ఖాతాకు జమ చేయకుండా స్వాహా చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని ఇద్దరు ఖాతాదారుల పేరుతో రికార్డుల్లో డ్యూటూ అకౌంట్ కింద చూపినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన
- రూ.50 లక్షలు స్వాహా..సీఈవో పరార్
- విచారణలో వెలుగులోకి..
- బ్యాంకు లాకర్ సీజ్..రికార్డులు స్వాధీనం
మదనపల్లె, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గుర్రంకొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో)లో ‘బంగారు సొమ్ములు’ స్వాహా అయ్యాయి. రూ.50లక్షలు స్వాహా చేసిన సీఈవో అనిల్‌కుమార్ కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారు. తాకట్టు బంగారాన్ని విడిపించుకున్న కస్టమర్లు చెల్లించిన సొమ్మును బ్యాంకు ఖాతాకు జమ చేయకుండా స్వాహా చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని ఇద్దరు ఖాతాదారుల పేరుతో రికార్డుల్లో డ్యూటూ అకౌంట్ కింద చూపినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన డీసీసీబీ అధికారులు విచారణ చేపట్టి, సొసైటీలోని బంగారం లాకర్ సీజ్ చేసి, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానిక సహకారశాఖ అధికారులు సొసైటీకి విచారణకు వెళ్లగా అప్పటికే సీఈవో పరార్ అయినట్లు తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలా మొన్న తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు సొసైటీలో నకిలీ బంగారంతో రూ.60 లక్షలు, నిన్న నిమ్మనపల్లె సొసైటీలో రూ.2.50 కోట్లు, తాజాగా గుర్రంకొండ సింగిల్ విండోలో రూ.50లక్షలు స్వాహాయాణం కొనసాగింది.
ఖాతాకు జమచేయకుండా స్వాహా
గుర్రంకొండ సొసైటీలో బంగారం తాకట్టుపై కస్టమర్లకు భారీగా రుణాలు ఇచ్చారు. వాటిని తిరిగి విడిపించుకునే క్రమంలో ఐదుగురు కస్టమర్లు రూ.50లక్షలు సొసైటీకి చెల్లించారు. ఈ మొత్తాన్ని సీఈవో డీసీబీసీ ఖాతాకు జమ చేయాల్సి ఉంది. కానీ జమ కాలేదు. దీన్ని పరిశీలించిన డీసీసీబీ అధికారులు అనుమానంతో సొసైటీలో తనిఖీ చేశారు. ఆ మొత్తాన్ని మరో ఇద్దరు కస్టమర్ల పేరున డ్యూటూ అకౌంట్‌గా నమోదు చేసినట్లు గుర్తించారు. మరింత లోతుగా విచారించే క్రమంలో గుర్రంకొండలోని ఇద్దరు కస్టమర్లను పిలిపించి విచారణ చేపట్టారు. సీఈవో స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మేల్కొన్న డీసీసీబీ అధికారులు బంగారం ఉన్న లాకర్‌ను సీజ్ చేయడంతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి వరకూ అందుబాటులో ఉన్న సీఈవో తర్వాత ఉన్నతాధికారులకు, విచారణ అధికారులకు అందుబాటులో లేకపోవడంతో పరారైనట్లు గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
గతంలోనూ రూ.20లక్షలు రికవరీ
శ్రీసత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్‌కు చెందిన సీఈవో అనిల్‌కుమార్ బైరెడ్డిపల్లె సొసైటీలో క్లర్క్‌గా పనిచేస్తూ రెండేళ్ల క్రితం గుర్రంకొండ సింగిల్‌విండోకు ఇన్‌చార్జి సీఈవోగా వచ్చారు. ఇదే తరహాలో ఆరునెలల క్రితం కూడా బంగారం సొమ్ములు రూ.20లక్షల మేర గోల్‌మాల్ కాగా తిరిగి రికవరీ చేసినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయనపై నిఘా పెట్టిన ఉన్నతాధికారులు సొసైటీలో రోజువారి లావాదేవీలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగా తాకట్టుపై పెట్టిన బంగారాన్ని విడిపించుకున్న ఐదుగురు కస్టమర్లు గతేడాది డిసెంబరులో విడిపించుకున్నారు. ఇందులో భాగంగా వచ్చిన రూ.50లక్షలను స్వాహా చేశారు.
విచారణ చేపట్టాం.. గుర్రంకొండ సొసైటీలో బంగారు నగల సొమ్ము స్వాహా అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఛార్జిగా ఉన్న సీఈవోను బాధ్యుడిగా చేస్తూ విచారణకు ఆదేశించాం. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిగ్గుతేలుస్తాం.
- శంకర్‌బాబు, సీఈవో, డీసీసీబీ, చిత్తూరు.