బంగారు కుటుంబాలకు అందని భరోసా!
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:37 AM
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 పథకం తిరుపతిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం చర్చకు వచ్చింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కార్పొరేషన్ కార్యకలాపాలను వివరిస్తున్నప్పుడు బంగారు కుటుంబాలకు ఉపాధి విభాగంలో 3 శాతం, ఆర్థిక సహకారంలో 1.6 శాతం సాయమందడాన్ని ఎమ్మెల్యే గుర్తించి ప్రస్తావించారు. మార్గదర్శులు ముందుకు రాకపోవడం వలన వెనుకబడుతున్నామని అధికారులు అంగీకరించారు. సమన్వయం చేసుకుని వారిని ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
తిరుపతిలో ఆశించిన ఫలితాలు ఇవ్వని పీ4 పథకం
శాఖల మధ్య సమన్వయ లోపమే కారణం
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 పథకం తిరుపతిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం చర్చకు వచ్చింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కార్పొరేషన్ కార్యకలాపాలను వివరిస్తున్నప్పుడు బంగారు కుటుంబాలకు ఉపాధి విభాగంలో 3 శాతం, ఆర్థిక సహకారంలో 1.6 శాతం సాయమందడాన్ని ఎమ్మెల్యే గుర్తించి ప్రస్తావించారు. మార్గదర్శులు ముందుకు రాకపోవడం వలన వెనుకబడుతున్నామని అధికారులు అంగీకరించారు. సమన్వయం చేసుకుని వారిని ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
ముందుకు రాని మార్గదర్శులు
అత్యంత పేద, సమస్యల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ పథకాలను ఒకే వేదికపై అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నత్తనడకన సాగుతోంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 6411 బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి తర్వాత మార్గదర్శుల్లో కొరవడినట్టు కనిపిస్తోంది.పీ4 పథకానికి ఎంపికైన కుటుంబాలను గుర్తించిన తర్వాత వారికి అవసరమైన సేవలు, సంక్షేమ పథకాల అనుసంధానం, ఉపాధి అవకాశాలు, వైద్య సహాయం, విద్యా సదుపాయాలు వంటి అంశాల్లో అధికార యంత్రాంగం చొరవ చూపడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. పలు కుటుంబాలు ఇప్పటికీ ఏ శాఖను సంప్రదించాలో తెలియక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమావేశాలు నిర్వహించడం, నివేదికలు పంపడానికే అధికారులు పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అవసరమైన సేవలు సమయానికి అందడం లేదని సమాచారం. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.పీ4 పథకం విజయవంతం కావాలంటే ప్రతి కుటుంబానికీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖలను సమన్వయం చేస్తేనే బంగారు కుటుంబాలు నిజంగా బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ దత్తత తీసుకున్న కుటుంబాలు - 6411
సహాయ రకం - బంగారు కుటుంబాల సంఖ్య - దత్తత శాతం
హెల్త్ అసిస్టెన్స్ - 2,116 33
ఎడ్యుకేషన్ - 751 11.7
స్కిల్ ఎంప్లాయిమెంట్ -1523 23.8
ఎంప్లాయిమెంట్ - 194 3
ఆర్థిక సహకారం - 102 1.6
ప్రభుత్వ పథకాలు - 1729 26.9