Share News

అధికారుల వేధించారని ఆశా కార్యకర్త ఆత్మహత్య

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:46 AM

ఆత్మహత్యకు యత్నించిన ఆశా కార్యకర్త రాణి.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించారు.

 అధికారుల వేధించారని ఆశా కార్యకర్త ఆత్మహత్య

రామకుప్పం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యకు యత్నించిన ఆశా కార్యకర్త రాణి.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించారు. అధికారుల వేధింపులే తన మృతికి కారణమంటూ ఆమె తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వి.కోట సీఐ సోమశేఖర్‌ తెలిపిన ప్రకారం.. వి.కోటలోని భారత్‌నగర్‌కు చెందిన రాణి ఓగు పీహెచ్‌సీలో ఏడాదిన్నరగా ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఐదు రోజులు క్రితం ఈమె నిద్రమాత్రలు మింగారు. ఎలుకల మందు కూడా తాగారు. కుటుంబసభ్యులు గుర్తించి బెంగళూరు అస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వేలూరు అస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాణి బుధవారం మృతి చెందారు.

సెలవు కూడా ఇవ్వలేదు

నిద్రమాత్రలు మింగకముందు రాణి తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వెలుగు చూసింది. పీహెచ్‌సీ వైద్యాధికారి మాధవి, మరో అధికారి నిత్య తనను కొంత కాలంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. వారం రోజుల కిందట తిరుమల వెళ్లేందుకు సెలవు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేవారు. రెండు నెలల జీతం కూడా ఇచ్చేదిలేదని బెదిరించారని పేర్కొన్నారు. తన అత్మహత్యకు వారే కారణమని ఆరోపించారు. రాణి మృతి చెందిన క్రమంలో ఆమె భర్త కేశవులు ఈ వీడియోను ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తుచేసి.. ఆమె మృతికి వైద్యాధికారులు కారకులని తేలితే కేసును సవరిస్తామన్నారు. చట్టప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. దర్యాప్తు నివేదికను కలెక్టరుకు పంపుతామన్నారు. దీనిపై డీఎంహెచ్‌వో నాగశశిభూషణ్‌ను వివరణ కోరగా.. రాణి ఆత్యహత్యపై పూర్తి వివరాలు తనకు తెలియదన్నారు. బుధవారం ఆమె మృతి చెందిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటప్రసాద్‌, జిల్లా కమ్యూనిటీ మొుబలైజర్‌ మూర్తితో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వారిచ్చే నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:46 AM