పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు షురూ
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:18 AM
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి
తిరుపతి(కలెక్టరేట్), సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 35మండలాల్లో 807 గ్రామ పంచాయతీలు ఉండగా, 791 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 16 పంచాయతీలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికలు నిర్వహించడంలేదు. ఇప్పటికే పంచాయతీల్లో పోలింగ్ స్టేషన్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. రిజర్వేషన్ల ఖరారుకు కీలకమైన కేటగిరీల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా సిద్ధం చేశారు. ఎన్నికలు జరిగే 791 పంచాయతీల పరిధిలో 12,54,368 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 6,43,744 మంది, పురుషులు 6,10,523మంది, ఇతరులు 101మంది ఉన్నారు. అత్యధికంగా తిరుపతి రూరల్ మండలంలో 1,52,078, పుత్తూరు మండలంలో అత్యల్పంగా 19,314 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంఽధించి జిల్లాలో 7,458 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రకటించారు. అత్యధికంగా తిరుపతి రూరల్ మండలంలో 434 కేంద్రాలుండగా, అత్యల్పంగా ఎర్రావారిపాళెంలో 122 పోలింగ్ కేంద్రాలున్నాయి. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. గురువారం నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు గ్రామసభలు నిర్వహించిన వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక 7వ తేదీన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాలను వెల్లడిస్తారు. కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలను ఆధారం చేసుకుని సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు డీపీవో సుశీలాదేవి తెలిపారు.
గ్రేటర్ తిరుపతిపై అస్పష్టత
తిరుపతి నగర పరిధిని విస్తృతం చేయడానికి గ్రేటర్ ప్రతిపాదన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగు మండలాల్లోని 568 పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ప్రతిపాదన సిద్ధం చేయగా, అప్పటి పాలకవర్గం ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అదే సమయానికి జనగణన ప్రారంభం కావడంతో గ్రేటర్ ప్రతిపాదన తాత్కాలికంగా వాయిదా పడింది. గ్రేటర్ తిరుపతి ఆవిర్భవిస్తే తిరుపతి రూరల్ మండలం పూర్తిగా, రేణిగుంట, ఏర్పేడు, రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల్లో కొన్ని పంచాయతీలు పాక్షికంగా విలీనం అవుతాయి. అయితే గ్రేటర్ తిరుపతిపై స్పష్టత లేకపోవడంతో ఆయా పంచాయతీల్లో సైతం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలా.. లేదా అన్న విషయమై రాష్ట్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.