2,87,759మంది ఓట్లు పోయినట్లేనా?
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:01 AM
జిల్లాలోని ఓటర్ల సంఖ్య 14,81,679మందిగా తేలింది. తొలగింపు జాబితాలో 2,87,759 మంది ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు గడువు శుక్రవారంతో ముగిశాక తేలిన లెక్క ఇది.జిల్లాలోని 2,099 పోలింగ్ కేంద్రాల్లో 17,69,438మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ.. స్వీకరణ.. డిజిటలైజేషన్ తర్వాత శుక్రవారం
-తిరుపతి,చంద్రగిరిల్లోనే తొలగింపు
జాబితాలో 1,41,065మంది
-జిల్లాలో ఓటర్ల సంఖ్య 14,81,679
తిరుపతి(కలెక్టరేట్), జూలై 24 (ఆంధ్రజ్యోతి):జిల్లాలోని ఓటర్ల సంఖ్య 14,81,679మందిగా తేలింది. తొలగింపు జాబితాలో 2,87,759 మంది ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు గడువు శుక్రవారంతో ముగిశాక తేలిన లెక్క ఇది.జిల్లాలోని 2,099 పోలింగ్ కేంద్రాల్లో 17,69,438మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ.. స్వీకరణ.. డిజిటలైజేషన్ తర్వాత శుక్రవారం సాయంత్రానికి జిల్లా యంత్రాంగం లెక్కలు ప్రకటించింది.జిల్లాలోని ఓటర్ల సంఖ్య 14,81,679 మందిగా తేలింది. అన్‌కలెక్టబుల్ జాబితాలో 2,87,759 మంది ఉన్నారు. ఇందులో మరణించిన ఓటర్లు 63,491మంది, 1,24,746మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, రెండుచోట్ల ఓటు ఉన్నవారు 31,606మంది, ఎన్యుమరేషన్ ఫారాలను వెనక్కి ఇవ్వనివారిలో 1,591 మంది, ఆచూకీ లేనివారు 66,325 మంది ఉన్నారు.
ఆ ఓటర్లు ఎక్కడో..
జిల్లాలో సర్ ప్రక్రియ పరిశీలిస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే 2,87,759 మంది అన్‌కలెక్టబుల్ జాబితాలో ఉన్నారు. వీరంతా సంబంధిత ధ్రువపత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పిస్తేనే తుది ఓటర్ల జాబితాలో వుంటారు. లేదంటే ఈ ఓట్లను తొలగించనున్నారు. ముఖ్యంగా తిరుపతిలో 90,806మంది, చంద్రగిరిలో 50,259 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఆచూకీ లేని ఓటర్లు కూడా ఈ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.వలస వెళ్లినవారిలోనూ తిరుపతిలో 57,186మంది, చంద్రగిరిలో 16,727మంది ఉన్నారు.ఐదేళ్ల క్రితం జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ బయట ప్రాంతాల నుంచి ఓటర్లను బస్సుల్లో తీసుకొచ్చి బోగస్ ఓట్లు వేయించిందన్న విమర్శలున్నాయి.ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇపుడీ లెక్కలు వీటికి బలం చేకూరుస్తున్నాయి.
పారదర్శకంగా ‘సర్’ :కలెక్టర్ వెంకటేశ్వర్
‘సర్’ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాం. తప్పుల్లేని ఓటరు జాబితా కోసం శ్రమించాం. అర్హుడైన ఏ ఒక్క ఓటరూ తొలగించే ప్రసక్తే లేదు. అన్‌కలెక్టబుల్ జాబితాలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆధారాలు సమర్పిస్తే జాబితాలో చేరుస్తాం.