క్లెయిమ్‌లు, అభ్యంతరాలుంటే 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ABN , Publish Date - Aug 01 , 2026 | 02:16 AM
‘సర్’ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించినట్లు డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‘సర్’ కార్యక్రమంపై సమీక్షించారు.
‘సర్’కు పార్టీల సహకారం అభినందనీయం
జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్
చిత్తూరు కలెక్టరేట్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘సర్’ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించినట్లు డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‘సర్’ కార్యక్రమంపై సమీక్షించారు. మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 12,04,067 మంది వివరాలను డిజిటలైజ్ చేశామన్నారు. మిగిలిన అర్హులైన ఓటర్లు కూడా జాబితాలో నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు. ఈ ముసాయిదా జాబితాపై శుక్రవారం నుంచి ఆగస్టు 30వ తేది వరకు ప్రజల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వీటిని సెప్టెంబరు 28లోగా బీఎల్వోలు విచారణ పూర్తిచేస్తారన్నారు. రాజకీయ పార్టీలచే నియమితులైన బూత్ లెవల్ ఏజెంట్లు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా సహకరించాలని కోరారు. కాగా, ముసాయిదా ఓటర్ల జాబితాలను అన్ని పోలింగ్ కేంద్రాలు, బీఎల్వోలు, ఓటర్ల నమోదు అధికారుల కార్యాలయాలు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు/తహశీల్దార్ల కార్యాలయాల్లో ఉంచామన్నారు. అందరూ ఈ జాబితాను పరిశీలించి తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం ఫారం-6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం-7, సవరణలు లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరోదానికి మార్పుకోసం ఫారం-8 ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. అయితే బల్క్‌గా ఫారాలు ఇవ్వడం లేదా స్వీకరించడం ఉండదని డీఆర్వో స్పష్టం చేశారు.అక్టోబరు 3వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని వివరించారు. కాగా, ఇప్పటి వరకు ‘సర్’ ప్రక్రియకు రాజకీయ పార్టీలు అందించిన సహకారం అభినందనీయమని మోహన్‌కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు ప్రజల భాగస్వామ్యంతో పాటు రాజకీయ పార్టీలూ సహకరించాలని కోరారు.
మ్యాపింగ్ చేసుకోని వారికి నోటీసులు
గడువు ముగిసినా మ్యాపింగ్ చేసుకోని 23,881 మంది ఓటర్లకు శుక్రవారం నుంచి నోటీసులు పంపిణీ చేస్తున్నట్లు డీఆర్వో మోహన్‌కుమార్ చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, వయస్సు వ్యత్యాసం తదితర లాజికల్ ఎర్రర్ అనమాలిస్ (తార్కిక దోషాలు) కలిగివున్న 1,10,205 మంది ఓటర్లకు కూడా నోటీసులు పంపిస్తామన్నారు. వీటికి ఓటర్లు తగిన రుజువులను చూపాలన్నారు. అందుకోసం బీఎల్వోలు నాలుగోసారి ఇంటింటికి వెళ్లి రోజూ పత్రాలు స్వీకరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి బి.లోకనాథం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.సురేంద్ర కుమార్, వైసీపీ నేత విజయసింహారెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల డీటీ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.