కలెక్టరేట్‌కు క్యూ కడుతున్న అర్జీదారులు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:45 AM
సమస్యల పరిష్కారానికి కొందరు, వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేందుకు మరికొందరు.. స్వయంగా కలెక్టర్‌కే చెప్పుకోవాలని ఇంకొందరు ఇలా బుధవారమైనా కలెక్టరేట్‌కు అర్జీదారులు క్యూ కట్టారు.
మదనపల్లె టౌన్, జనవరి 28(ఆంధ్రజ్యోతి: సమస్యల పరిష్కారానికి కొందరు, వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేందుకు మరికొందరు.. స్వయంగా కలెక్టర్‌కే చెప్పుకోవాలని ఇంకొందరు ఇలా బుధవారమైనా కలెక్టరేట్‌కు అర్జీదారులు క్యూ కట్టారు. సాధారణంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారమూ ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తోంది. మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, సబ్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌లో అయితే 300కుపైగా అర్జీలు వస్తున్నాయి.
బుధవారమైనా క్యూ కట్టిన అర్జీదారులు
కలెక్టరేట్‌లో బుధవారం 50 మందికి పైగా అర్జీదారులు, విజిటర్స్ కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. సోమవారం రిపబ్లిక్ డే పరేడ్ కారణంగా కలెక్టరేట్‌లో, పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ రద్దు చేశారు. ఈ కారణంగా బుధవారం అర్జీదారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వేచి ఉండి కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు సమస్యలు విన్నవించుకున్నారు. మదనపల్లె అవంతి థియేటర్ వీధి వద్ద దశాబ్దాల నుంచి మసీదుకు, మదరాసాకు వెళ్లే దారిలో ఓ వ్యక్తి గోతులు తవ్వేశారని ముస్లిం మహిళలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తంబళ్లపల్లెలో వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటుకు మూడు రోడ్ల కూడలిలో స్థలం కేటాయించాలని తంబళ్లపల్లె వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్‌కు విన్నవించారు. వీటితో పాటు వ్యక్తిగత, రెవెన్యూ సమస్యలు చెప్పుకునేందుకు 20 మందికి పైగా కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు.