Share News

ఎస్‌ఎస్‌లో ఉద్యోగినిపై ఏపీసీ లైంగిక వేధింపులు

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:46 PM

సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌) విభాగ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఏపీసీను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ నివేదిక పంపారు

ఎస్‌ఎస్‌లో ఉద్యోగినిపై ఏపీసీ లైంగిక వేధింపులు

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌) విభాగ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అడిషినల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (ఏపీసీ) గౌరీశంకర్‌రావును ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ అతడిపై చర్యలకు సిఫారసు చేస్తూ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ నివేదిక పంపారు. గౌరీశంకరరావు కొంతకాలంగా తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగినిని లైంగికంగా వేధిస్తున్నాడు. భరించలేకపోయిన ఆ ఉద్యోగిని ఆయన ఇంటికెళ్లి ఫిర్యాదు చేసింది. అయినా మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో బాధితురాలు డీఈవో కేవీఎన్‌ కుమార్‌కు ఫిర్యాదుచేయడంతో ఆయన జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే విచారణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో అంతర్గతంగా విచారించారు. ఘటన వాస్తవమేనని ఆదివారం రాత్రి నివేదికలు కలెక్టర్‌కు అందడంతో ఆయన సీరియస్‌ అయ్యారు. తక్షణం డిప్యూటీ కలెక్టర్‌, ఎస్‌ఎస్‌ ఏపీసీ అయిన గౌరీశంకర్‌రావును ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ.. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు కలెక్టర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. అలాగే ఉమెన్‌ ప్రొటెక్షన్‌ కమిటీతోనూ విచారణ చేయిస్తామన్నారు. కాగా, ఏపీసీపై కేసు నమోదుచేసి జైలుకు పంపాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Apr 12 , 2026 | 11:46 PM