కిడ్నీ రాకెట్ కేసుపై ఏపీ శ్యాక్స్ పీడీ విచారణ
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:33 AM
రాష్ట్రంలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ శ్యాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)స్మరణ్‌రాజ్ విచారణ చేపట్టారు. బుధవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్‌లో ఆయా జిల్లాలకు చెందిన డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎ్‌సలు, ఇతర సీనియర్ వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మదనపల్లె క్రైం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ శ్యాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)స్మరణ్‌రాజ్ విచారణ చేపట్టారు. బుధవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్‌లో ఆయా జిల్లాలకు చెందిన డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎ్‌సలు, ఇతర సీనియర్ వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా వైద్యారోగ్యశాఖ, పోలీస్ అధికారులను విచారించి వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మదనపల్లె ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో గతేడాది నవంబరు 9న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స వికటించి ఓ మహిళ మృతి చెందడంతో ఆస్పత్రి గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. టూటౌన్ పోలీసులు అప్పట్లో మొత్తం 23 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20మందిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. మరో ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శాఖాపరమైన విచారణలో భాగంగా ఏపీ శ్యాక్స్ పీడీ మదనపల్లెకు చేరుకుని వైద్యబృందంతో కలసి క్షేత్రస్థాయి విచారణ చేసి నివేదికలు తయారు చేశారు. చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, కడప, కర్నూల్ డీసీహెచ్‌ఎ్‌సలు పద్మాంజలీదేవి, లక్ష్మీప్రసాద్, షరీఫ్, హిమదేవి, కామేశ్వరప్రసాద్, కడప, అన్నమయ్య డీఎంహెచ్‌వోలు యుగంధర్, శ్రీనివాసులు, అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి రాధిక, ఎయిడ్స్ నియంత్రణ మండలి జేడీ సుకుమార్, మాజీ డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య, మాజీ డీసీహెచ్‌ఎ్‌స, గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకులు ఆంజనేయులు, ఇతర సీనియర్ వైద్యాధికారులు విచారణలో పాల్గొని వాంగ్మూలం ఇచ్చారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు విచారణ జరిగింది. నివేదికలను వైద్యారోగ్యశాఖకు అందజేస్తున్నట్లు పీడీ పేర్కొన్నారు. కాగా తొలుత డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, వైద్యాధికారులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీడీకి ఘనస్వాగతం పలికారు.