Share News

‘సర్‌’ నోటీసులపై గుబులు

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:33 AM

జిల్లాలో సర్‌ ప్రక్రియలో ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో లక్షకుపైగా ఎన్యూమరేషన్‌ ఫారాలను తప్పులతడకగా నింపారు. ఫలితంగా వారంతా అనామాలిస్‌ జాబితాలోకి చేరారు. వీరికి బీఎల్వోల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,34,307 మందిని గుర్తించి శుక్రవారం నాటికి 1,23,595 మందికి (92.02 శాతం) నోటీసులు అందించారు. మిగిలిన 10,712 మందికి శనివారం నోటీసులు అందజేసి పూర్తిచేస్తారు.

‘సర్‌’ నోటీసులపై గుబులు
చిత్తూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఓటర్లకు నోటీసులు ఇచ్చి హియరింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు

92.02 శాతం సర్‌ నోటీసుల పంపిణీ పూర్తి

మిగిలిన నోటీసులు నేడు అందజేత

48 వేల మంది విచారణకు గైర్హాజరు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సర్‌ ప్రక్రియలో ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో లక్షకుపైగా ఎన్యూమరేషన్‌ ఫారాలను తప్పులతడకగా నింపారు. ఫలితంగా వారంతా అనామాలిస్‌ జాబితాలోకి చేరారు. వీరికి బీఎల్వోల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,34,307 మందిని గుర్తించి శుక్రవారం నాటికి 1,23,595 మందికి (92.02 శాతం) నోటీసులు అందించారు. మిగిలిన 10,712 మందికి శనివారం నోటీసులు అందజేసి పూర్తిచేస్తారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అధికారుల ముందు విచారణ హాజరై 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ చేసుకోవడానికి, తప్పులు సరిదిద్దడానికి ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారు. సర్‌లో భాగంగా ఇంటింటి సర్వే అనంతరం ఎన్నికల సంఘం గత నెల 31న ముసాయిదా జాబితా విడుదల చేసింది. అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 30 వరకు గడువు ఇచ్చారు. వివరాలు తప్పులు ఉన్నవారితో పాటు 2002 ఓటరు జాబితాలో ప్రక్రియ పూర్తికాని 1,34,307 మంది ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు.

రామకుప్పం మండలం చివరిస్థానం

జిల్లా నోటీసుల పంపిణీలో నియోజకవర్గాల వారీగా నగరి 99.39శాతంతో ప్రఽథమ, గంగాధరనెల్లూరు 95.61 శాతంతో ద్వితీయ స్థానాల్లో నిలువగా, 93.16 శాతంతో పలమనేరు తృతీయ స్థానంలో నిలిచింది. 87.69 శాతం మాత్రమే పూర్తిచేసి చిత్తూరు వెనుకబడి ఉంది. కుప్పంలో 89.30శాతం పూర్తయింది. పూతలపట్టు 92.37 శాతం మాత్రమే పూర్తి చేసింది. మండలాలు, మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కుప్పం, నగరి అర్బన్‌, పుత్తూరు అర్బన్‌, పలమనేరు అర్బన్‌, నగరి రూరల్‌, వడమాలపేట, నిండ్ర మండలాల్లో నూరు శాతం నోటీసుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. 82.04శాతంతో రామకుప్పం మండలం చిట్టచివరి స్థానంలో ఉంది. చిత్తూరు అర్బన్‌ 84.04 శాతం, కుప్పం రూరల్‌ 85.71 శాతం, బంగారుపాళ్యం మండలాల్లో 88.25 శాతం మాత్రమే పూర్తయింది.

గైర్హాజరైనవారికి మళ్లీ నోటీసులు

తాజాగా నోటీసులు అందుకున్నవారిలో 17292 మంది విచారణకు హాజరై తగిన ద్రువత్రాలు అందజేశారు. 48,723 మంది ఇచ్చిన తేదీకి విచారణకు రాకుండా గైరాజరయ్యారు. ఇందులో చాలామంది వృద్ధులు, ఎక్కడ హాజరుకావాలో తెలియని వారు ఎక్కువమంది ఉన్నారు. గైర్హాజరయ్యే ఓటర్లకు మూడుసార్లు నోటీసులు ఇస్తారు. అప్పటికీ రాకపోతే ఓటు తొలగిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, రోగులు, విచారణకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు.

ఏదైనా ఒక్క ఆధారం చాలు

నోటీసులు అందుకున్నవారు ఏడు రోజుల గడువులోగా ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై అర్హత నిరూపించుకోవడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కదాన్ని సమర్పించినా.. దాన్ని పరిశీలించి జాబితాలో పేర్లు చేరుస్తారు. ఓటర్ల నుంచి ఈనెల 30 వరకు అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తారు. జాబితా, నోటీసులు పొందిన వారి వివరాలు పోలింగ్‌ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా ఓటు హక్కును అర్హులైన వారు ఫారం-6 దాఖలు చేయాల్సింది ఉంటుంది. కొత్తగా ఓటరుగా చేర్పు, తొలగింపులు, చిరునామాల మార్పులు, తప్పులు సరిదిద్దడానికి ఫారం-7, 8 అందుబాటులో ఉంచారు.

Updated Date - Aug 22 , 2026 | 12:33 AM