వేటగాళ్ల కరెంటు ఉచ్చుకు మరొకరు బలి
ABN , Publish Date - May 15 , 2026 | 01:02 AM
జంతువుల కోసం అటవీప్రాంతంలో కొందరు వేటగాళ్లు వేసిన కరెంటు ఉచ్చుకు ఒక రైతు బలయ్యారు. ఆవును వెదక్కుంటూ వెళ్లిన ఆయన.. కరెంటు తీగలను చూసుకోకుండా తగలడంతో అసువులు బాశారు.
అటవీప్రాంతలో ఆవును వెదుకుతూ.. విద్యుత్తు వైర్లు తగిలి రైతు మృతి
పలమనేరు, మే14 (ఆంధ్రజ్యోతి): జంతువుల కోసం అటవీప్రాంతంలో కొందరు వేటగాళ్లు వేసిన కరెంటు ఉచ్చుకు ఒక రైతు బలయ్యారు. ఆవును వెదక్కుంటూ వెళ్లిన ఆయన.. కరెంటు తీగలను చూసుకోకుండా తగలడంతో అసువులు బాశారు. ఈ విషాదం ఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి అటవీ ప్రాంతంలో గురువారం జరిగింది. రైతు శ్రీనివాసులుకు చెందిన ఆవు తప్పిపోయింది. దానిని వెదుకుతూ గురువారం ఆయన అటవీప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కొందరు వేటగాళ్లు అడవి జంతువుల కోసం విద్యుత్ తీగలను లాగి ఉంచారు. ఈ క్రమంలో శ్రీనివాసులు పాడి ఆవును వెదికే క్రమంలో అక్కడి విద్యుత్ తీగల్ని గుర్తించకుండా దాటే యత్నంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. గ్రామస్థులు కొందరు గుర్తించి శ్రీనివాసులు మృతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. శ్రీనివాసులు భార్య వసంత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.