కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:55 AM
రాష్ట్రంలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ మహ్మద్‌రఫీ చెప్పారు.
కొనసాగుతున్న అరెస్ట్‌ల పరంపర
మదనపల్లె క్రైం, జూలై 3(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ మహ్మద్‌రఫీ చెప్పారు. ఆయన వివరాల మేరకు.. గతేడాది నవంబర్ 10న మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాళెం గ్రామానికి చెందిన యమున కిడ్నీని తొలగించి మరొకరికి అమర్చారు. శస్త్రచికిత్స వికటించి మరుసటి రోజు ఆమె మృతిచెందడంతో ఆస్పత్రి గుట్టు రట్టయింది. అప్పట్లో యమున సహా మొత్తం 22 మందిపై కేసు నమోదు చేశారు. అందులో 15మందిని ఇదివరకే అరెస్ట్ చేయగా శుక్రవారం ఆస్పత్రి వైద్యులు అవినాష్, శాశ్వితి అలియాస్ సంజనాగోషన్, స్టాఫ్‌నర్సు మీనాక్షిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. దీంతో నిందితుల అరెస్ట్ సంఖ్య 18కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అప్పటి డీసీహెచ్‌ఎస్ ఆంజనేయులు, శస్త్రచికిత్స చేసిన పార్థసారథిరెడ్డిలను అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. తాజాగా గురువారం రాత్రి ఆంజనేయులు భార్య సరళమ్మ, శుక్రవారం కుమారుడు అవినాష్, కోడలు శాశ్వితిలను అరెస్ట్ చేయడంపై మదనపల్లెలో కలకలం రేగింది. తొలుత నిందితులను ఏఎస్పీ వెంకటాద్రి ఎదుట హాజరుపరిచారు. విచారణ, వైద్యపరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు.