Share News

ఎంబీయూ కేంద్రంగా మరో వివాదం

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:23 AM

మోహన్‌బాబు యూనివర్శిటీ కేంద్రంగా తరచూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. విద్యార్థుల నుంచీ అధిక ఫీజులు వసూలు చేశారని గతేడాది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ వర్శిటీకి భారీగా జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంబీయూ హైకోర్టును ఆశ్రయించింది.

ఎంబీయూ కేంద్రంగా మరో వివాదం
మోహన్‌బాబు యూనివర్సిటీపై చర్యలు చేపట్టాలని ఆందోళనకు దిగిన సీపీఐ, సీఐటీయూ నేతలు

తిరుపతి(కలెక్టరేట్‌/భవానీనగర్‌/నేరవిభాగం/విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబు యూనివర్శిటీ కేంద్రంగా తరచూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. విద్యార్థుల నుంచీ అధిక ఫీజులు వసూలు చేశారని గతేడాది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ వర్శిటీకి భారీగా జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంబీయూ హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందు ఇక్కడే విద్యాసంస్థల్లోకి ప్రవేశించేందుకు మోహన్‌ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్‌ ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యాసంస్థల పరిసరాల్లో కొన్ని దుకాణాలు, హోటళ్ళపై కూడా ఆ విద్యాసంస్థలకు చెందిన బౌన్సర్లు దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. తాజాగా తిరుపతి కలెక్టరేట్‌ సమీపంలో జరిగిన కిడ్నాప్‌ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్‌బాబు యూనివర్శిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎ్‌ఫతో పాటు మరి కొన్ని సంఘాలు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేయడానికి కలెక్టరేట్‌ వద్దకు బయలుదేరారు. అయితే తిరుచానూరు దళితవాడ క్రాస్‌ వద్ద ఎంబీయూ ప్రతినిధులు, బౌన్సర్లు అడ్డగించారు.ఎ్‌సఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి అక్బర్‌, ఎస్వీయూ క్యాంపస్‌ ఇన్‌ఛార్జి వినోద్‌లపై దాడి చేసి చితకబాదారు.అనంతరం వారిద్దరినీ కిడ్నాప్‌ చేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళారు. దాడి నుంచీ తప్పించుకున్న మరో ఎస్‌ఎ్‌ఫఐ నాయకుడు రెడ్డికుమార్‌ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కిడ్నాపర్ల వేట మొదలైంది.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ సుబ్బరాయుడు ఏఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించడంతో గంట వ్యవధిలోనే బాధితులను రక్షించారు. డీఎస్పీ ప్రసాద్‌, తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌, ఎస్‌ఐ సుధాకర్‌ల బృందం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుంది.

వర్సిటీ గుర్తింపును రద్దు చేయాలన్న సీపీఐ, సీఐటీయూ

మోహన్‌బాబు విద్యాసంస్థల బౌన్సర్లు విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్‌ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, సీపీఐ రాష్ట్ర నేత రామానాయుడు మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పించే ప్రాంగణంలో విద్యార్థులను అదుపు చేయడానికి బౌన్సర్లను ఏర్పాటు చేయడం ఉన్నత విద్యా మండలి నిబంధనలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. విద్యార్థి సంఘ నేతల కిడ్నా్‌పకు ప్రోత్సహించిన వారిపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే

ఎంతటివారినైనా వదలం : ఎస్పీ సుబ్బరాయుడు.

కిడ్నాపులు, దాడులకు పాల్పడుతూ సమాజంలో భయాందోళనలు సృష్టించేవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్‌ ఘటనను ఉటంకిస్తూ... ఈ దుశ్చర్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు.పోలీసుల సమన్వయ చర్యల ఫలితంగా గంట వ్యవధిలోనే కిడ్నా్‌పకు గురైన అక్బర్‌ను, వినోద్‌ను రక్షించగలిగామని వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులతో పాటు, వారు ఉపయోగించిన వాహనాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కిడ్నా్‌పకు ప్రత్యక్షంగా పాల్పడిన వారితో పాటు, చేయించిన వారిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

లోకేశ్‌ దృష్టికి తీసుకెళతాం: తెలుగు యువత

ఎస్‌ఎ్‌ఫఐ నాయకుల కిడ్నాప్‌ వ్యవహారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళతామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనందగౌడ్‌ పేర్కొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో రౌడీయిజానికి తావులేదని స్పష్టం చేశారు. కిడ్నాప్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన వారిపై చట్ట పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 02:23 AM