Share News

మూతబడిన మరో పాఠశాల

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:17 AM

గతేడాది ఒక్కడే విద్యార్థి. అతడూ వెళ్లిపోయాడు. ఈ విద్యాసంవత్సంలో ఒకటో తరగతిలో మరో విద్యార్థి చేరాడు. ఆ విద్యార్థికి ఒక టీచరు. ఇలా సాగుతున్న గుడిపాల మండలం కమ్మతిమ్మపల్లి ప్రాథమిక పాఠశాలను బుధవారం మూసివేశారు. ఆ విద్యార్థిని పక్క పాఠశాలలో చేర్పించారు. ఇదే తరహాలో నడుస్తున్న కుప్పం మండలం బొగ్గుపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం విద్యాశాఖ అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. కమ్మతిమ్మపల్లి పాఠశాలను బుధవారం ఎంఈవో హస్సన్‌ బాషాతో కలిసి డీఈవో లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు.

మూతబడిన మరో పాఠశాల
కమ్మతిమ్మపల్లి పాఠశాలలోని ఒక విద్యార్థిని 197 రామాపురం మోడల్‌ ప్రైమరీ స్కూల్లో చేర్చుతున్న డీఈవో లక్ష్మీనారాయణ

చిత్తూరు సెంట్రల్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గతేడాది ఒక్కడే విద్యార్థి. అతడూ వెళ్లిపోయాడు. ఈ విద్యాసంవత్సంలో ఒకటో తరగతిలో మరో విద్యార్థి చేరాడు. ఆ విద్యార్థికి ఒక టీచరు. ఇలా సాగుతున్న గుడిపాల మండలం కమ్మతిమ్మపల్లి ప్రాథమిక పాఠశాలను బుధవారం మూసివేశారు. ఆ విద్యార్థిని పక్క పాఠశాలలో చేర్పించారు. ఇదే తరహాలో నడుస్తున్న కుప్పం మండలం బొగ్గుపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం విద్యాశాఖ అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. కమ్మతిమ్మపల్లి పాఠశాలను బుధవారం ఎంఈవో హస్సన్‌ బాషాతో కలిసి డీఈవో లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు. ఇక్కడ ఒకటో తరగతిలో గౌరవ్‌ అనే విద్యార్థి ఒక్కడే ఉన్నాడు. అతడికి మార్కొండేయులనే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ బోధన చేస్తున్నారు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులను డీఈవో ఒప్పించి, కిలోమీటరు దూరంలోని 197 రామాపురం మోడల్‌ ప్రైమరీ పాఠశాలలో చేర్పించారు. ఆ విద్యార్థికి రవాణా అలవెన్స్‌నూ మంజూరు చేయించారు. ఆ ఉపాధ్యాయుడిని కూడా 197 రామాపురంలోని మోడల్‌ ప్రైమరీ స్కూల్‌కు కేటాయించారు. ఈ కమ్మతిమ్మపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండేవి. ఐదేళ్లుగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కేవలం నలుగురే. దీంతో ఈ పాఠశాలను ఏకోపాధ్యాయ పాఠశాలగా గుర్తించి, కొనసాగిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆ నలుగురు విద్యార్థుల్లో ఒకరు ప్రైవేటు.. మరో ఇద్దరు ఇతర పాఠశాలలకు వెళ్లి పోయారు. దీంతో గతేడాది చదువుకున్న ఒక్క విద్యార్థి కూడా మరో పాఠశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో గ్రామానికి చెందిన గౌరవ్‌ అనే విద్యార్థిని తల్లిదండ్రులు చేర్పించారు. ఇతడికి ఒక టీచరు పాఠాలు చెబతున్నారు. ఇలా రెండేళ్లుగా ఒకే విద్యార్థి, ఒక టీచర్‌గా ఈ పాఠశాల నడస్తోంది. చివరకు బుధవారం మూతపడింది.

మరో బడిలో సర్దుబాటు

గుడిపాల మండలం వెంగమాంబపురంలో ఫౌండేషన్‌ స్కూల్‌ (1, 2 తరగతులు) ఉంది. ఇందులో 19 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 8 మంది మాత్రమే 1, 2 తరగతులు చదువుతున్నారు. మిగిలిన 11 మంది విద్యార్థులు 3,4,5 తరగతులు చదువుతున్నారు. వీరికి ఇక్కడ అనుమతి లేకపోగా, గ్రామంలోని సమస్యలు, వీరి పిల్లలకు అక్కడ భద్రత లేకపోవడం కారణంగా సమీపంలోని ఏఎల్‌పురం మోడల్‌ ప్రైమరీ పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో విద్యార్థులకు హాజరు నమోదు కాకపోవడంతో ‘తల్లికి వందనం’ పథకానికి దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రయోజనాలు అందలేదు. అయినా, తల్లిదండ్రులు సమీప పాఠశాలకు పంపడానికి నిరాకరిస్తున్నారు. బుధవారం ఈ గ్రామానికి వెళ్లిన డీఈవో లక్ష్మీనారాయణ, ఎంఈవో హస్సన్‌ బాషా విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత నచ్చచెప్పినా, ఫలితం లేకుండా పోయింది. విద్యార్థుల భవిష్యత్తు, స్థానికంగా నెలకొన్న సమస్యలు, తల్లిదండ్రులు చెప్పిన కారణాలను దృష్టిలో పెట్టుకున్న డీఈవో.. పిల్లల్ని వెంగమాంబపురంలోని ఫౌండేషన్‌ స్కూల్‌కు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏఎల్‌ పురం మోడల్‌ ప్రైమరీ పాఠశాలలోని టీచర్లలో ఒకరిని సర్దుబాటు చేయడంతో పాటు ఈ పిల్లలకు పూర్తి హాజరు వేసేలా చర్యలు తీసుకున్నారు. కాగా, వెంగమాంబపురంలోని విద్యార్థులను ఏఎల్‌ పురం మోడల్‌ ప్రైమరీ పాఠశాలకు వెళ్లకుండా చేయడంలో టీచర్‌ పాత్ర ఉందని తాను గ్రహించినట్లు డీఈవో తెలిపారు. ఈ రెండు పాఠశాలల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన డీఈవో, ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు.

Updated Date - Aug 20 , 2026 | 01:17 AM