సులోచనపై మరో కేసు
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:10 AM
రౌడీషీటర్, లేడీడాన్ కోనేటి సులోచనపై మరో కేసు నమోదైంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు సహా మొత్తం 12మందిపై ఫోర్జరీ, చీటింగ్, అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్‌ఐ నాగేశ్వరరావు చెప్పారు.
- కుటుంబ సభ్యులు, అనుచరులపై కూడా..
మదనపల్లె క్రైం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్, లేడీడాన్ కోనేటి సులోచనపై మరో కేసు నమోదైంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు సహా మొత్తం 12మందిపై ఫోర్జరీ, చీటింగ్, అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్‌ఐ నాగేశ్వరరావు చెప్పారు. ఎస్‌ఐ కథనం మేరకు..మదనపల్లెకు చెందిన మార్పూరి శ్రీరామ్‌కు వారసత్వంగా వచ్చిన భూమిని 2023లో అతని దాయాది మార్పూరి వెంకటేష్‌నాయుడు సులోచనకు విక్రయించినట్లుగా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి పులివెందుల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ర్టేషన్ చేసుకుంది. ఈ కాగితాలను అడ్డుపెట్టుకుని నీరుగట్టువారిపల్లెలోని టమోటా మార్కెట్ యార్డు పక్కన శ్రీరామ్‌కు చెందిన 50సెంట్ల భూమిని కబ్జా చేసింది. అయితే రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్‌లో నమోదు చేసిన భూమి సర్వేనంబర్ రెవెన్యూ రికార్డుల్లో లేదు. పైగా తప్పుడు సర్వే నంబర్లతో భూమిని అక్రమ రిజిస్ర్టేషన్ చేసుకుని ఆక్రమించింది. దీంతో కొన్నాళ్లుగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతుండటంతో కక్షలు ఏర్పడ్డాయి. సులోచన ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి తన భూమిని అక్రమ రిజిస్ర్టేషన్ చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులు, అనుచరులతో కలసి భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేసిందని బాధితుడు శ్రీరామ్ ఇటీవల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సులోచనపై మదనపల్లె వన్‌టౌన్, టూటౌన్, తాలూకా, ములకలచెరువు పోలీ్‌సస్టేషన్లలో ఇదివరకే 14కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుతో ఆ సంఖ్య 15కు చేరింది. వన్‌టౌన్ పోలీసులు కొన్ని రోజుల కిందట నమోదు చేసిన కేసుల్లో ఆమె తల్లి రెడ్డెమ్మ పరారీలో ఉండగా, మిగతా నలుగురు జైలులో ఉన్నారు. జైలులో ఉన్న నలుగురిని త్వరలో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో 8మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తామని తెలిపారు.