Share News

ఇక.. గ్రామ సంగ్రామం

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:52 AM

ఇక.. గ్రామ సంగ్రామం మొదలు కానుంది. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

 ఇక.. గ్రామ సంగ్రామం
నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న కలెక్టర్‌

మూడు విడతల్లో నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

తొలివిడతకు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇక.. గ్రామ సంగ్రామం మొదలు కానుంది. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలివిడతకు ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం ఆయన పల్లె పోరుకు నోటిఫికేషన్‌ జారీ చేసి మాట్లాడారు. మండలాలను మూడు విడతలుగా విభజించి ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘తొలి విడతలో పలమనేరు నియోజకవర్గంలోని ఐదు.. కుప్పంలోని నాలుగు కలిపి.. మొత్తం 9 మండలాల్లో ఎన్నికలు నిర్వహిచనున్నాం. రెండో విడతలో పూతలపట్టు నియోజకవర్గంలోని ఐదు.. పుంగనూరు నియోజకవర్గంలోని రెండు.. నగరిలోని మూడు మండలాలు కలిపి మొత్తం 10 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. మూడో విడతలో జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఆరు.. చిత్తూరు నియోజకవర్గంలోని రెండు కలిపి 8 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఈనెల 26న తొలివిడత, 29న రెండో విడత, డిసెంబరు రెండో తేదీన మూడో విడత పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారుల నియామకాన్ని ఖరారు చేశాం. సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నాం. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, శిక్షకులను కూడా సిద్ధం చేశాం’ అని కలెక్టర్‌ వివరించారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసు శాఖ సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సుమిత్‌కుమార్‌ వివరించారు.

Updated Date - Nov 14 , 2026 | 01:52 AM