ఇక సుష్టుగా భోజనం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:23 AM
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనే నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సంకల్పించింది. ఆరోగ్యం మీద ప్రభావం చూపే మెనూ విషయంలో రాజీ పడకూడదని భావించింది. ఈక్రమంలోనే తాజాగా పదిశాతం డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మెనూలో కోతకు చెల్లుచీటీ
హాస్టళ్లలో డైట్ చార్జీల పెంపు
నాణ్యమైన ఆహారానికి ప్రభుత్వం పెద్దపీట
8,141 మంది విద్యార్థులకు ప్రయోజనం
చిత్తూరు అర్బన్, జూలై 11(ఆంధ్రజ్యోతి): సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనే నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సంకల్పించింది. ఆరోగ్యం మీద ప్రభావం చూపే మెనూ విషయంలో రాజీ పడకూడదని భావించింది. ఈక్రమంలోనే తాజాగా పదిశాతం డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హాస్టల్ నిర్వాహకులతో పాటు విద్యార్థులకూ ఈ పెంపు ఊరట ఇవ్వనుంది. జిల్లా వ్యాప్తంగా 8,141 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల విద్యార్థులకు ప్రయోజనం కలగుంది.
సర్దుకోనక్కర్లేకుండా...
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014-18) చికెన్ ధర కిలో రూ.160 ఉండగా డైట్ ఛార్జీలను పెంచింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాటు డైట్ ఛార్జీలను పెంచలేదు. క్రమంగా చికెన్‌తో పాటు అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే బిల్లుకు లోబడి విద్యార్థులకు ఆహారాన్ని పెట్టడం కష్టంగా తయారైంది. పది కిలోల చికెన్ కొనాల్సిన హాస్టల్‌లో ఐదు కిలోలే కొని సర్దేవారు. మెనూ ప్రకారం నెలలో రెండు రోజులు కోడిగుడ్లను పెట్టాల్సి ఉన్నా మిన్నకుండిపోయేవారు. కొందామంటే బడ్జెట్ సరిపోయేది కాదు. ఇలాగే మామూలు కూరలు కూడా తిన్నంత పెట్టలేక పెట్టలేకపోయేవారు. పెట్టలేదనే మాట రాకుండా మొక్కుబడిగా వడ్డిస్తూ జాగ్రత్త పడేవారు. విద్యార్థులు కూడా తినాలని ఉన్నా సరిపెట్టుకునేవారు. చాలీచాలని అర్దాకలితోనే లేచిపోయేవారు.
తప్పిన ఇబ్బందులు
ఈక్రమంలో ప్రభుత్వం పదిశాతం డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో హాస్టల్ వార్డెన్లకు కొంత ఉపశమనం కలగనుంది. నిబంధనల ప్రకారం ఆహారాన్ని పెట్టగలమనే నమ్మకం కలిగిందని ఓ వార్డెన్ చెప్పారు. ఇంతకు ముందు ఆరు నెలలకు ఒకసారి డైట్ బిల్లులు వచ్చేది. కూరగాయలు, చికెన్ షాపుల వారికి సకాలంలో బకాయిలు చెల్లించలేకపోయేవారు. ఇప్పుడు క్రమం తప్పకుండా డైట్ బిల్లులు వస్తున్నాయని వార్డెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించే అవకాశం కలుగుతుందని వారు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలా..
గత వైసీపీ ప్రభుత్వం హాస్టళ్లను పట్టించుకోలేదు. మరో ఏడాదిలో ఎన్నికలొస్తున్నాయనగా అంటే 2023లో డైట్ ఛార్జీలను పెంచింది. దాంతో పెంచిన డైట్ ఛార్జీలతో కలిపితే 3,4 తరగతుల విద్యార్థులకు నెలకు రూ. 1,150 5-10 తరగతులకు రూ.1,400, ఇంటర్, ఆపై చదివే విద్యార్థులకు 1,600 ఉండేది. ప్రస్తుతం కిలో చికెన్ రూ.240, కోడిగుడ్డు రూ.6, లీటరు పాలు రూ.60, చింతపండు కిలో. రూ.70, మిరపపొడి కిలో రూ.300, సాంబారు పౌడరు కిలో రూ.300 గా ధరలు ఉన్నాయి. ఏ కాయగూరకొనాలన్నా కిలో ధర రూ.50కి తక్కువ లేదు. పెరిగిన ధరలు, వార్డెన్ల ఇబ్బందులను పరిగణనలో తీసుకున్న కూటమి ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జిలను పెంచింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.