భక్తులతో కిటకిటలాడిన అనంతపురం
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:27 AM
లక్కిరెడ్డిపల్లె, మండలంలోని అనంతపురం గ్రామంలో గంగమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. అమ్మవారు వేకువజామున తన పుట్టినిల్లు చాగలగుట్టపల్లె నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు జాతర ప్రాంతానికి చేరుకుంది.
లక్కిరెడ్డిపల్లె, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని అనంతపురం గ్రామంలో గంగమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. అమ్మవారు వేకువజామున తన పుట్టినిల్లు చాగలగుట్టపల్లె నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు జాతర ప్రాంతానికి చేరుకుంది. ఈడిగ వంశీయులు అమ్మవారికి కళ్లు సమర్పించారు. చౌటుపల్లెకు చెందిన రామయ్యగారి కృష్ణారెడ్డి కుటుంబం అమ్మవారికి సిద్దలకూడు సమర్పించారు. చాందిని, కుంకుమ బండ్లతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి ఒంటి గంటకు అమ్మవారి ఆలయం చుట్టూ కుంకుమ, చాందిని బండ్ల ఊరేగింపు నిర్వహించారు. సాంస్కృతిక కార్య క్రమాలు ఆకట్టుకున్నాయి.
భక్తులతో కిక్కిరిసిన ఆలయం
జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉచితం, రూ.10, రూ.100, రూ.300 క్యూలు తెల్లవారుజాము నుంచే నిండిపోయాయి. ఆరోగ్యం సరిగా లేని, సంతానం లేక ఇబ్బంది పడేవారు అమ్మవారి ముందు వరపడ్డారు. అర్చకులు వారికి సిద్దలకూడు సమర్పించారు. జాతర ప్రాంగణంలో 20 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు దాతలు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు.
పట్టువస్ర్తాల సమర్పణ
అనంతపురం గంగమ్మ తల్లికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ అర్చకులు కుంభాభిషేకంతో ఆహ్వానం పలికగా అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి, పూజలు చేయించారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి, లక్కిరెడ్డిపల్లె సివిల్ కోర్టు జడ్జి భరత్ కమల్, పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు.