Share News

చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:18 AM

టిడ్కో ఇళ్లు ప్రారంభించి లబ్ధిదారులను వేదికమీద ఆయనతోపాటు కూర్చోబెట్టుకున్నారు.

 చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

తిరుపతి సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి నాయుడుపేటకు వచ్చారు. టిడ్కో ఇళ్లు ప్రారంభించి లబ్ధిదారులను వేదికమీద ఆయనతోపాటు కూర్చోబెట్టుకున్నారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మహిళలను మహరాణులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అపూర్వ స్వాగతానికి బాబు పులకించిపోయారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూసి ఈ జన్మకు తనకింకేం కావాలంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.పేదోళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. 2029లోపు రాష్ట్రంలో ఇల్లు లేని పేదోడు ఉండరని హమీ ఇచ్చారు. ‘ఎప్పటికీ మీరే మా సీఎం’ అంటూ పెద్దఎత్తున ప్రజా స్పందన రావడంతో మురిసిపోయారు. రాజకీయాల్లోకి వచ్చి సేవచేయాలనుకునే మహిళలకు ఇది సరైన సమయమన్నారు. టీడీపీతోపాటు కూటమి పార్టీలు మహిళలకు పెద్దపీట వేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

టీడీపీ కార్యకర్తలతో కలివిడిగా..

టీడీపీ కార్యకర్తలే తన బలం అన్న సందేశాన్ని అధినేత చంద్రబాబు మరోసారి స్పష్టత ఇచ్చారు. నాయుడుపేట పర్యటనలో ఆయన నాయకులతో మాత్రమే కాకుండా సామాన్య కార్యకర్తలతో కలివిడిగా కనిపించారు. టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో దాదాపు 600 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు మార్కు సీరియ్‌సగా కాకుండా సరదాగా, స్ఫూర్తివంతంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీకి నష్టం కల్గిస్తున్న నేతలకు సున్నితంగా చురకలంటించారు. నాయకుల కన్నా కార్యకర్తలే పార్టీకి బలమని, వారిని అన్నివిధాలుగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌ రాజకీయ వ్యూహాలపై సూచనలు చేశారు. ఇకపై నియోజకవర్గాల పర్యటనకు వెళ్లినప్పుడు కార్యకర్తల కోసం ఓ గంట సమయం కేటాయిస్తానని, తనకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని చెప్పారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరితో ఫొటో దిగి జోష్‌ను నింపారు.

Updated Date - Mar 31 , 2026 | 01:18 AM