వినూత్న ‘ఉద్యాన’ ప్రయోగ వేదిక
ABN , Publish Date - Jul 27 , 2026 | 02:24 AM
సీఎం ఆశయానికి అనుగుణంగా కుప్పం ఉద్యాన శాఖ వినూత్నమైన ప్రయోగాలతో నూతన పంటల సాగుకు భూములను సిద్ధం చేస్తోంది. ఒప్పంద వ్యవసాయ (బై బ్యాక్) పద్ధతి ద్వారా రైతులకు విస్తృత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చిరు విజయాలు నమోదు చేసి ముందుకు దూసుకు పోతోంది.
వట్టివేర్లు.. పనస తోటలు.. ఇంకా ఎన్నెన్నో
కుప్పం ఒక ప్రయోగశాల. ఏ పథకమైనా, పద్ధతైనా ఇక్కడే మొదలు పెడుతున్నాం. విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
- కుప్పం పర్యటనకు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలివి.
సీఎం ఆశయానికి అనుగుణంగా కుప్పం ఉద్యాన శాఖ వినూత్నమైన ప్రయోగాలతో నూతన పంటల సాగుకు భూములను సిద్ధం చేస్తోంది. ఒప్పంద వ్యవసాయ (బై బ్యాక్) పద్ధతి ద్వారా రైతులకు విస్తృత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చిరు విజయాలు నమోదు చేసి ముందుకు దూసుకు పోతోంది.
- కుప్పం, ఆంధ్రజ్యోతి
జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కుప్పంలో వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ గాలిలో తేమ శాతం కాస్త అధికం. ఉష్ణోగ్రతలు తక్కువే. భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా, సాగునీటి వసతి పరిమితం. వీటిని దృష్టిలో ఉంచుకుని ఉద్యాన శాఖ పంటల ఉత్పత్తిలో ప్రయోగాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యాన శాఖ ఏడీ పోస్టును ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పల్లవి ఏడీగా కొనసాగుతున్నారు. సిబ్బంది తక్కువైనా తన పంథాలో సాగుతూ రైతులను సమీకరించి వినూత్న పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. వీటిని ‘ఫీల్డ్ లెవల్ డెమాన్‌స్ట్రేషన్ (ఎఫ్‌ఎల్‌డీ)’ పద్ధతిలో అంటే.. పరిమితమైన విస్తీర్ణంలో, పరిమిత రైతులతో సాగు చేయిస్తున్నారు.
గట్టి లాభాన్నిచ్చిన వట్టి వేరు
గతేడాది (2025-26) ఎఫ్‌ఎల్‌డీ పద్ధతితో వట్టివేర్ల సాగును కుప్పం మండలం నూలుకుంటకు చెందిన రైతు మూర్తి ప్రయోగాత్మకంగా చేపట్టారు. వెయ్యి బ్యాగ్‌లను (మొక్కను బ్యాగ్ అంటారు) 10 సెంట్ల స్థలంలో నాటించారు. వెయ్యి మొక్కలు ఒక యూనిట్. బై బ్యాక్ పద్ధతిలో తమిళనాడు రాష్ట్రం తేని ప్రాంతానికి చెందిన అరోమ్యాటిక్ రూట్ క్వీన్ అనే కంపెనీ ఈ మొక్కలను సరఫరా చేసింది. గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నాటారు. ఇది ఏడాది పంట. మొక్క నుంచి సుమారు రెండు కిలోల వట్టివేర్లు వచ్చాయి. అంటే 2 వేల కిలోల వట్టివేర్ల దిగుబడి వచ్చింది. కిలో రూ.200 చొప్పున ఆ కంపెనీ రైతునుంచి కొనుగోలు చేసింది. మొత్తం రూ.4 లక్షలు రాగా.. అందులో ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు మిగిలినట్లు రైతు మూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆయనతో పాటు మరికొందరు వట్టివేర్ల సాగుకు ముందుకొస్తున్నారు. యూనిట్ సాగు ధర రూ.లక్షగా ప్రభుత్వం నిర్ణయించింది. వినూత్న పంట కావడంతో 75 శాతం సబ్సిడీ లభించగా, మిగతా రూ.25 వేలు రైతు చెల్లిస్తే సరిపోతుంది.
పనస.. పసందు
మూడేళ్ల కిందట ఉద్యాన శాఖ పనస సాగుకు శ్రీకారం చుట్టింది. నూలుకుంటకు చెందిన రైతులు నాగరాజు, జె.వన్నెప్ప 2.5 ఎకరాల్లో (ఎకరాకు 300 చొప్పున) 800-900 పనస మొక్కలు నాటారు. చిత్తూరులోని షైన్ గోల్డ్ ఆర్గానిక్ కంపెనీ బైబ్యాక్ పద్ధతిలో వీరికి మొక్కలు సరఫరా చేసింది. ఇప్పుడిప్పుడే ఫలసాయం వస్తోంది. ఒక చెట్టుకు 9-10 కాయలు వచ్చినా.. దాదాపు 50-60 కిలోల దిగుబడి ఉంటుంది. బై బ్యాక్ పద్ధతిలో మొక్కలిచ్చిన కంపెనీనే వీటిని కొంటుంది. నూలుకుంటలోనే కాకుండా మల్లానూరులోనూ ఒకరిద్దరు బైబ్యాక్ పద్ధతిలో పనస సాగు చేశారు. వీరు సాధిస్తున్న లాభాలు చూసి రామకుప్పం మండలం బందార్లపల్లెకు చెందిన రైతు బి.నాగరత్నం పనస సాగుకు ముందుకొచ్చారు. వారం కిందట 1.5 ఎకరాలలో బై బ్యాక్ పద్ధతిలో పనస మొక్కలను నాటారు. పనస సాగుకు ప్రభుత్వం నుంచి హెక్టార్‌కు రూ.18 వేలు సబ్సిడీ లభిస్తుంది.
‘బై బ్యాక్’ పద్ధతిలో..
కుప్పం ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనువైన, వినూత్న పంటల సాగుకు ఉద్యాన శాఖ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మార్కెటింగ్‌లో రిస్కు లేకుండా.. బైబ్యాక్ పద్ధతిలో విత్తనం లేదా మొక్కలను సరఫరా చేసే కంపెనీలకోసం చూస్తోంది. అలా, వట్టివేర్లు, పనస సాగు చేపట్టడం, రైతులు లాభాలు గడించడం సాధ్యమైంది. బేబీ కార్న్, స్వీట్ కార్న్, పార్స్‌లీ (ఒకరకమైన కొత్తిమీర లాంటి మొక్క) సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకరిద్దరు రైతులు ముందుకొస్తున్నారు. కానీ, బై బ్యాక్ పద్ధతిలో ముందుకొచ్చే కంపెనీల కోసం చూస్తున్నారు. ఇలా ఉద్యాన శాఖ అధికారుల ప్రయత్నం ఫలవంతమైతే కుప్పం రైతులకు స్వర్ణయుగమేనని చెప్పొచ్చు.
మార్కెటింగ్ అవకాశాలకోసం అన్వేషణ
ఉద్యాన పంటలకు సంబంధించి పలు ప్రాజెక్టులు చేపట్టడానికి ఉత్సాహంగా ఉన్నాం. కొత్తరకం పట్టల సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నది నిజం. అయితే మార్కెటింగ్ అతి ముఖ్యం. పంట దిగుబడి వచ్చాక కొనే వాళ్లు లేకుంటే రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకనే మార్కెటింగ్ అవకాశాల కోసం అన్వేషిస్తున్నాం. మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల్లోని వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలతో టై అప్ కావడానికి ప్రయత్నిస్తున్నాం. బైబ్యాక్ పద్ధతిలో ఎలాంటి రిస్కు ఉండదు కాబట్టి రైతులకు లాభాలు దక్కుతాయి. ఇప్పటికే పార్స్‌లీ మొక్కల సాగుకు బై బ్యాక్ పద్ధతితో ముందుకొచ్చే కంపెనీకోసం అన్వేషిస్తున్నాం. స్వీట్ కార్న్, బేబీ కార్న్ వంటి పంటల సాగుకూ ప్రయత్నిస్తున్నాం.
- పల్లవి, కుప్పం ఉద్యాన శాఖ ఏడీ