ఒక ఐడియా పంటను కాపాడుతుంది
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:16 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో టమోటా పంట ప్రాధాన్యత గురించి కొత్త్తగా చెప్పాల్సిన పనిలేదు. అధిక దిగుబడి కోసం రైతులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుత ఎండల నుంచి నారును, మొక్కలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన కూలింగ్ నెట్, పేపర్ గ్లాస్‌లు ఆలోచింపజేస్తున్నాయి.
కూలింగ్ నెట్, పేపర్ గ్లాస్‌తో ఎండల నుంచి ఉపశమనం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో టమోటా పంట ప్రాధాన్యత గురించి కొత్త్తగా చెప్పాల్సిన పనిలేదు. అధిక దిగుబడి కోసం రైతులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుత ఎండల నుంచి నారును, మొక్కలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన కూలింగ్ నెట్, పేపర్ గ్లాస్‌లు ఆలోచింపజేస్తున్నాయి.
బి.కొత్తకోట, ఏప్రిల్12 (ఆంధ్రజ్యోతి): వేసవిలో టమోటా నారును బతికించడం, మొక్కలను ఏపుగా పెంచడం అంత సులువైన పనికాదు. ఈ మండు వేసవిలో పంటను కాపాడుకుంటే జూన్, జూలైలో కాయలొస్తాయి. ఆ టైంలో మంచి ధర ఉంటుందనే నమ్మకంతో ఎంత కష్టమైనా, ఖర్చయినా వెరవకుండా రైతులు ముందుకు పోతున్నారు.
ఎండ తగలనివ్వని కూలింగ్ నెట్
టమోటా మొక్కలకు అధిక వేడి తగిలితే ఎదుగుదల లోపిస్తుంది. ఆకులు ముడతపడి ముడుగు రోగం, రెమ్మలు పగలకుండా పీలగా తయారవుతాయి. ఎన్ని డ్రిప్పు ఎరువులు వదిలినా చెట్టు గుబురుగా రాదు. సాధారణంగా రైతులు డ్రిప్పు, స్ర్పేయింగ్‌లతోనే ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి విరుగుడు అన్నట్లు కూలింగ్ నెట్ అందుబాటులోకి వచ్చింది. నారు నాటిన వెంటనే కట్టెలు నాటించి వాటి మధ్యలో దోమతెరలాంటి ఈ కూలింగ్ వలను అమర్చడం వల్ల మొక్కపై ఎండపడదు. పైగా ఎండపెరిగే కొద్దీ ఈ తెరనుంచి మొక్కకు చలవ వస్తుంది. దీంతో చెట్టు ఎండతాకిడి నుంచి తప్పించుకుని మంచి ఎదుగుదల, దిగుబడి ఇస్తుంది. ఇది ఖర్చుతో కూడిన పద్ధతి కావడంతో రైతులందరూ పాటించలేరు.
కూలింగ్ మల్చింగ్..పేపర్ గ్లాస్‌లతో రక్షణ
టమోటా సాగుకోసం బెడ్డు తోలగానే ఎరువులు చల్లి మల్చింగ్ పేపరు పరుస్తారు. బెడ్డు తడవగానే మొక్కలు నాటుతారు. వేసవి వేడిని తట్టుకుని మొక్కలు నిలిచేలా కూలింగ్ మల్చింగ్‌పేపర్ అందుబాటులో ఉంది. దీన్ని పరిచి నాటడం వల్ల పేపర్‌పై ఎంత వేడి ఉన్నా లోపల చల్లగా ఉంటుంది. దీంతో మొక్క బాగా ఎదుగుతుంది. అదేవిధంగా పేపర్‌గ్లాస్ విధానం కూడా. మల్చింగ్ పేపర్‌పై టమోటా మొక్క నాటే సమయంలోనే ఒక్కో గ్లాస్‌ను రంధ్రంలో పెట్టి గ్లాస్ మధ్యలో మొక్కను నాటుతారు. దీనివల్ల ఎండ తాకిడికి మల్చింగ్ పేపర్ వేడెక్కినా గ్లాస్ రక్షణగా ఉంటుంది. రెమ్మలు మల్చింగ్‌పై వాలకుండా గ్లాస్ ఆపుతుంది. పేపర్ కింద చేరిన నత్తలు మొక్క కాండాన్ని కొరకడానికి వీలుండదు. దీంతో మొక్క దశలో రక్షణ ఉంటుంది.