Share News

అంబటి కన్నా ఆంబోతు నయం

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:00 AM

వైసీపీ నేత అంబటి రాంబాబు కన్నా ఆంబోతు నయమని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాజకీయాన్ని కలుషితం చేస్తూ గొడవలు, హత్యలకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై సోమవారం తిరుపతిలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి.

అంబటి కన్నా ఆంబోతు నయం

టీడీపీ నేతల ఆగ్రహం

తిరుపతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత అంబటి రాంబాబు కన్నా ఆంబోతు నయమని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాజకీయాన్ని కలుషితం చేస్తూ గొడవలు, హత్యలకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై సోమవారం తిరుపతిలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద టీడీపీ నేతలు రవినాయుడు, జేబీ శ్రీనివాస్‌ ఆధ్వర్వంలో అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ గురించి నీచమైన మాటలు మాట్లాడితే ప్రజలు తోలుతీస్తారని హెచ్చరించారు. ఇకనుంచి అంబటికి కూటమి నేతల సినిమా ఏవిధంగా వుంటుందో చూపిస్తామన్నారు. గంగమ్మ ఆలయ ఛైర్మన్‌ మహేష్‌

యాదవ్‌, కార్పొరేటర్‌ అన్నా అనిత, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తోట వాసు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ పార్లమెంటు అధ్యక్షుడు హేమంత్‌ రాయల్‌ మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రంలోకి మళ్లీ బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తోందన్నారు. చంద్రబాబును దూషిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.ఆకు రౌడీకన్నా నీచంగా మాట్లాడుతున్న అంబటి రాంబాబును పార్టీ ఆదేశిస్తే అంతుచూస్తామని డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ అలిపిరివద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంను విమర్శిస్తే ఖబడ్దార్‌!

సీఎం చంద్రబాబును సంస్కారం లేకుండా విమర్శిస్తే తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గత ఐదేళ్ళూ చంద్రబాబు పట్ల అమానుషంగా వ్యవహరించిన పాపానికి వైసీపీ 11 స్థానాలతో మూల్యం చెల్లించింది. ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా మునుపటిలానే ప్రవర్తిస్తే ఆ పార్టీకి పుట్టగతులుండవు. అంబటి తీరు అతడితో పాటు వైసీపీ సంస్కృతిని చాటుతోంది. అయితే అలాంటి సంస్కృతిని సహించేది లేదు. చట్టపరంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు తోడు టీడీపీ శ్రేణుల ఆగ్రహాన్ని కూడా చవి చూడాల్సి వస్తుంది.

- పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే

చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి

అంబటి రాంబాబు అహంకారంతో మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా వున్నాయి. చివరికి అతడి కుటుంబ సభ్యులు కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వుంది.మాకూ నోళ్ళున్నాయి, అయితే సంస్కారం అడ్డొస్తోందంతే. అంబటి లాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా కొనసాగడం సమాజానికి హానికరం.అలాంటి వారిని అడ్డుకోలేని వైసీపీ అధినేత జగన్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

- గాలి భానుప్రకాష్‌, నగరి ఎమ్మెల్యే

అంబటి వ్యాఖ్యలు జుగుప్సాకరం

చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రపంచ దేశాల్లో ఆంధ్రరాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తిపై వైసీపీ రౌడీలు అభ్యంతరకరంగా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాం.ఆ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలుగుదేశం తరపున ఆయనకు బుద్ధి చెబుతాం.

- నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే

అవాకులు చవాకులు పేలితే నాలుకకోస్తా

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే నాలుకకోస్తాం.శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యిని కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ నేతల పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొనివుంది.ఆ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రిని వైసీపీ నేతలు దుర్భాషలాడుతున్నారు.భాషను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.

- కురుగొండ్ల రామకృష్ణ , వెంకటగిరి ఎమ్మెల్యే

Updated Date - Feb 01 , 2026 | 02:00 AM