Share News

జడ్పీ పీఠం కూటమి కైవసం

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:37 AM

జిల్లా పరిషత్‌ పీఠాన్ని కూటమి గెలుచుకుంది. జిల్లాలో 25 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 3 టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 22 స్థానాలకు ఈనెల 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహించారు. అందులో 17 జడ్పీటీసీ స్థానాలకు ఫలితాలను ప్రకటించగా 14 టీడీపీ, వైసీపీ 2, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మిగిలిన స్థానాలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా కౌంటింగ్‌ కొనసాగింది.

జడ్పీ పీఠం కూటమి కైవసం
పీలేరు కౌంటింగ్‌ కేంద్రం వద్ద సంబరాలు చేసుకుంటున్న వాల్మీకిపురం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు

పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో కూటమిదే పైచేయు

జడ్పీటీసీ స్థానాల్లో కూటమి జోరు.. ఎంపీటీసీలలో వైసీపీ పోటాపోటీ

అన్నమయ్య, నవంబర్‌ 7(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ పీఠాన్ని కూటమి గెలుచుకుంది. జిల్లాలో 25 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 3 టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 22 స్థానాలకు ఈనెల 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహించారు. అందులో 17 జడ్పీటీసీ స్థానాలకు ఫలితాలను ప్రకటించగా 14 టీడీపీ, వైసీపీ 2, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మిగిలిన స్థానాలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా కౌంటింగ్‌ కొనసాగింది. గాలివీడు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి ప్రసాద్‌బాబు 29,820 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. చిన్నమండెం జడ్పీటీసీ స్థానం నుంచి మండిపల్లె లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి 20,293 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. సంబేపల్లె జడ్పీటీసీగా మల్లు కరుణ 9వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కలికిరి షేక్‌.షర్మిలా, చౌడేపల్లె కవిత, సోమల సుబ్రమణ్యంనాయుడు, గుర్రంకొండ అజాద్‌ అహ్మద్‌, కురబలకోట సురేంద్రయాదవ్‌, వాల్మీకిపురం కె.లక్ష్మీదేవి విజయం సాధించారు. పుంగనూరు నరసింహులు, కేవీపల్లె మహేంద్రరెడ్డి, రామసముద్రం ఏ.సుజాత, తంబళ్లపల్లె సందప్ప గెలిచారు. పెద్దమండ్యం ఆవుల మల్లికార్జునరెడ్డి గెలుపొందారు. నిమ్మనపల్లె, మదనపల్లె, సదుం, బి.కొత్తకోట, పీటీఎం మండలాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే కూటమి స్పష్టమైన ఆధిక్యతతో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోనుంది. జిల్లాలో 321 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 174 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 147 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 140 స్థానాలకు ఫలితాలను ప్రకటించారు. కూటమి 73 గెలవగా ఇందులో టీడీపీ 62, జనసేన 3, బీజెపీ 2 చోట్ల గెలుపొందింది. వైసీపీ 67 స్థానాల్లో గెలిచింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలాల్లో వైసీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. సదుంలో 10 స్థానాలకు 8, పెద్దమండ్యంలో 10 స్థానాల్లో 9, తంబళ్లపల్లెలో 11 స్థానాల్లో 10 వైసీపీ గెలుచుకుంది.

Updated Date - Nov 08 , 2026 | 02:37 AM