Share News

కో-ఆప్షన్‌పై కూటమి కుస్తీ

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:12 AM

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఎంపిక ప్రక్రియ పూర్తికాకముందే కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

కో-ఆప్షన్‌పై కూటమి కుస్తీ

తిరుపతి సిటీ - ఆంధ్రజ్యోతి: తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఎంపిక ప్రక్రియ పూర్తికాకముందే కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కార్పొరేటర్‌ పదవులు దక్కని కొందరు నేతలు, పార్టీ కోసం పనిచేసిన మరికొందరు నాయకులు ఈ నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు కీలకం కానున్నాయన్న విషయం కొందరికి తెలిసినట్టులేదు. సంబంధిత రంగాల్లో అనుభవం, నిర్దేశిత అర్హతలు ఉన్నవారికే కో-ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. 2021లో తొలిసారి ఏర్పాటైన తిరుపతి కార్పొరేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిల్లో కో-ఆప్షన్‌ సభ్యులను నియమించాలని వైసీపీ భావించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నియమించాల్సిందేనని అప్పటి కమిషనర్‌ చెప్పడంతో అప్పటికప్పుడు ఆశావహులు కాకపోయినా పిలిచి మరీ కో-ఆప్షన్‌ సభ్యులుగా వైసీపీ కూర్చోబెట్టాల్సి వచ్చింది.

అర్హతలు ఇలా..

కార్పొరేషన్‌ కౌన్సిల్లో మొత్తం ఐదుగురు కో-ఆప్షన్‌ సభ్యులుంటారు. వీరిలో ఇద్దరు మైనార్టీ ప్రతినిధులు (ముస్లిం ఒకరు, క్రిస్టియన్‌ ఒకరు) ఉండాలి. అదేవిధంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ లేదా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో పనిచేసిన అనుభవం కలిగినవారు మరో ఇద్దరికి (అంటే మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు) అవకాశం ఉంటుంది.వీరిలో ఒకరు మహిళై ఉండాలి.మిగిలిన ఒక పదవికి ప్రభుత్వంలో పనిచేసి రిటైరైన అధికారికి అవకాశం ఉంటుంది. అయితే కూటమి పార్టీల్లోని ఆశావహులు మాత్రం ఈ అర్హతలు లేకపోయినా తమకు అవకాశం కల్పించాలంటూ నేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పలువురి నుంచి సిఫారసులు కూడా చేయించడం కూటమి నేతలకు తలనొప్పిగా మారుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలనే రాజకీయ అవసరం ఒకవైపు.. ప్రభుత్వ నిబంధనలను అనుసరించాల్సిన బాధ్యత మరోవైపు ఉండటంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టతరంగా మారింది.

అలా కుదిరిన కూటమి ఒప్పదం

ఐదుగురు కో-ఆప్షన్‌ సభ్యులకు అవకాశం ఉండగా టీడీపీకి 3, జనసేనకు 2 ఇవ్వాలని పొత్తులో భాగంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఎన్నికల ముందు జరిగిన కూటమి సీట్ల పంపకాల్లో బీజేపీకి తొలుత 6 డివిజన్లు కేటాయించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒక డివిజన్‌ను టీడీపీ కోరింది. అందుకు ప్రతిగా కో-ఆప్షన్‌ సీటు ఒకటి ఇచ్చేలా చెప్పడంతో బీజేపీ నాయకత్వం అంగీకరించింది. దీంతో టీడీపీ, జనసేన నుంచి ఇద్దరు చొప్పున బీజేపీనుంచి ఒకరు సభ్యులుగా ఉండనున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 01:12 AM