Share News

ప్రచారాలు, పంపకాల్లో కూటమి దూకుడు

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:39 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తిరుపతి, పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేటల్లో జరిగిన ఎన్నికల ప్రచారం, పంపకాలు వంటివి పరిశీలిస్తే కూటమి పార్టీల దూకుడు స్పష్టంగా కనిపిస్తుండగా ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన చోట్ల వైసీపీ అన్నింటా వెనుక బడినట్టు తెలుస్తోంది.

ప్రచారాలు, పంపకాల్లో కూటమి దూకుడు

సగటున ఓటుకు రూ.వెయ్యి పంపిణీ

పలుచోట్ల అన్నింటా వెనుకబడిన వైసీపీ

రూ. 500 నుంచీ రూ.వెయ్యి లోపు పంపిణీ

తిరుపతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తిరుపతి, పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేటల్లో జరిగిన ఎన్నికల ప్రచారం, పంపకాలు వంటివి పరిశీలిస్తే కూటమి పార్టీల దూకుడు స్పష్టంగా కనిపిస్తుండగా ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన చోట్ల వైసీపీ అన్నింటా వెనుక బడినట్టు తెలుస్తోంది. తిరుపతి నగర కార్పొరేషన్‌ విషయానికొస్తే కూటమి పార్టీలు చాలావరకూ బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించాయి. చాలామంది ముఖ్య నేతలు తాము స్వయంగానో లేదంటే కుటుంబ సభ్యులనో బరిలో నిలిపారు.ఎన్నికల ప్రచారంలోనూ హోరెత్తించారు. ఓటర్లకు పంపకాల విషయంలోనూ వెనుకంజ వేయలేదు. ఇంచుమించు ప్రతి వార్డులోనూ సగటున రూ. వెయ్యి చొప్పున పంపిణీ జరిగింది. ఓ మాజీ ఎమ్మెల్యే సన్నిహిత బంధువు పోటీ చేస్తున్న వార్డులో ఏకంగా ఓటుకు రూ. 4 వేల చొప్పున పంచారు. కూటమిలో కొన్నిచోట్ల అభ్యర్థుల మద్దతుదారులు రూ. 1500 నుంచీ రూ. 2 వేల దాకా పంచారు. ఓ ముఖ్య నాయకుడు తన వార్డులో పోటీ తీవ్రం కావడంతో నగదుకు తోడు ఇంటింటికీ ఇత్తడి దీపస్తంభాలను పంపిణీ చేశారు. ఇక తిరుపతిలో వైసీపీ నేతలు నిలిపిన అభ్యర్థులు చాలావరకూ కొత్తవారు, ఆర్థికంగా బలహీనంగా వున్నారు. వీరి మద్దతుదారులు సగటున రూ. 500 చొప్పున ఓటర్లకు పంపకాలు చేశారు. నాయుడుపేటలో ఇరువర్గాలూ పోటాపోటీగా ప్రచారాలు, పంపకాలూ పూర్తి చేశారు. ఇక్కడ అటు కూటమి, ఇటు వైసీపీ వర్గీయులు పంపకాల్లో తగ్గకుండా రూ. 1500 చొప్పున పంపిణీ చేశారు. వెంకటగిరిలోనూ అదే జోరు కనిపించింది. ఇరుపక్షాలూ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారాలూ హోరెత్తించాయి. అలాగే పంపకాల్లోనూ పోటీ పడ్డాయి. అయితే చివరి దశకు వచ్చేసరికి పంపకాల్లో వైసీపీ వర్గీయులు వెనుకబడినట్టు తెలిసింది. కూటమికి మించి పంచుతామని బీరాలు పలికిన ముఖ్యనేత ఒకరు తీరా పోలింగ్‌ ముందురోజు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని తెలిసింది. దీంతో డీలా పడిన వైసీపీ అభ్యర్థుల మద్దతుదారులు అతికష్టమ్మీద రూ. 500 చొప్పున పంపిణీ చేశారు. కూటమి వైపు నుంచీ రూ. వెయ్యి మొదలు రూ. 1500 వరకూ పంచారు. ఒక వార్డులో రూ. 2 వేల చొప్పున పంపిణీ చేశారు. సూళ్ళూరుపేటలో కూటమి పరంగా రూ. వెయ్యి నుంచీ రూ. 1500 వరకూ పంపకాలు చేయగా వైసీపీ తరపున రూ. 500 మించలేదు. పుత్తూరులోనూ అదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం వారి మద్దతుదారులు రూ. వెయ్యి చొప్పున ఇవ్వగా వైసీపీ వర్గీయులు రూ. ఐదువందలకే పరిమితమయ్యారు.

Updated Date - Nov 01 , 2026 | 01:39 AM