వాహనాలన్నీ బంకులవైపే..
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:28 AM
డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు, సామాన్యులకు అవస్థలు తప్పడం లేదు. రోజూ ఇంధనం సరఫరా చేసిన చమురు కంపెనీలు నాలుగైదు రోజులకొకసారి ట్యాంకర్లను పంపుతున్నాయని, దీంతో బంకులు మూయాల్సిన పరిస్థితి నెలకొందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
కొన్నిచోట్ల ఇంధన కొరతతో అవస్థలు
జిల్లాలో ఇబ్బంది లేదు: కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు, సామాన్యులకు అవస్థలు తప్పడం లేదు. రోజూ ఇంధనం సరఫరా చేసిన చమురు కంపెనీలు నాలుగైదు రోజులకొకసారి ట్యాంకర్లను పంపుతున్నాయని, దీంతో బంకులు మూయాల్సిన పరిస్థితి నెలకొందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో 120 పెట్రోల్ బంకులున్నాయి. రోజుకు 260 కిలోలీటర్ల డీజిల్,180 కిలోలీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు. చాలామంది వాహనదారులు సరిహద్దులోని తమిళనాడు, కర్ణాటకలకు వెళ్ళి పెట్రోల్, డీజిల్ పట్టుకోవడంతో జిల్లాలో అంతగా కొరత ప్రభావం కనిపించడం లేదు. కొన్నిచోట్ల కొరతతో పాటు దొరకదేమోనన్న భయంతో కొందరు పెట్రోల్ బంకులకు క్యూకడుతున్నారు. చిత్తూరులో నిత్యం రద్దీగా ఉండే ఆరు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. చాలాచోట్ల 10 లీటర్లకు మించి పెట్రోల్, డీజిల్ ఇవ్వడంలేదు. కాగా తిరుపతి జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడింది. అన్నమయ్య జిల్లాలో ఎలాంటి ప్రభావం కనిపించలేదు..
కొరత లేదు...
జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్,జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ,ట్రైనీ ఐపీఎస్ తరుణ్‌పహువా లు ఆదివారం రాత్రి చిత్తూరు నగరంలోని పెట్రోలు బంకులను తనిఖీ చేశారు. ప్రకాశం హైరోడ్డులోని మిట్టూరు సమీపాన ఉన్న బంకుకు అప్పుడే వచ్చిన ట్యాంకరును పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి పంపిణీని ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. నో స్టాక్ బోర్డును తొలగించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా పెట్రోలు,డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా నిరంతరం ఇంధనం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఆదివారం నాటికి జిల్లావ్యాప్తంగా 1,173 కిలో లీటర్ల పెట్రోల్, 1,355 కిలో లీటర్ల డీజల్ నిల్వలున్నాయన్నారు. ఈ నిల్వ వారం రోజులకు సరిపోతుందన్నారు. రోజూవారి పెట్రోల్ బంకులను తనిఖీ చేయాలని మండల తహసీల్దార్లను ఆదేశించామన్నారు. పెట్రోల్ యజమానులు డీడీ చెల్లించిన వివరాలు డీఎస్వోకు చెబితే స్టాకు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటారన్నారు. వాహన యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోల్, డీజల్ కొరత లేదని స్పష్టం చేశారు.