మద్యం మత్తు జీవితాలు చిత్తు
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:32 AM
చిత్తూరు నగరంలోని సీబీరోడ్డులో 30 ఏళ్ల యువకుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. మొదట మద్యానికి అలవాటు పడ్డ అతడు, ఆ తర్వాత స్నేహితులతో కలిసి డ్రగ్స్‌కు బానిసయ్యాడు.
విచక్షణ కోల్పోయి నిందితులుగా మారుతున్న వైనం
ఒక్కోసారి తల్లిదండ్రులనూ కడతేరుస్తున్న బిడ్డలు
కొడుకు హింస భరించలేక..
చిత్తూరు నగరంలోని సీబీరోడ్డులో 30 ఏళ్ల యువకుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. మొదట మద్యానికి అలవాటు పడ్డ అతడు, ఆ తర్వాత స్నేహితులతో కలిసి డ్రగ్స్‌కు బానిసయ్యాడు. రోజూ డ్రగ్స్, మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను కొట్టేవాడు. కొడుకు హింసను భరించలేని తండ్రి మునియాండి.. రెండు నెలల కిందట అదే రోడ్డులో సైకిల్‌లో పోతూనే లారీ కింద పడి చనిపోయాడు.
తండ్రినే చంపేశాడు
శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామానికి చెందిన జ్యోతీశ్వరన్ మద్యానికి బానిసకావడంతో భార్య పదేళ్ల ముందు వెళ్లిపోయింది. అప్పట్నుంచి తల్లితో కలిసి చిత్తూరులో ఉంటున్నాడు. రెండు వారాల కిందట క్షీరసముద్రానికి వెళ్లిన అతడు.. తండ్రికి వచ్చే వికలాంగ పింఛన్ డబ్బులను అడిగాడు. ఆయన ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో మరుసటి రోజు వేకువజామున కత్తితో తండ్రిని పొడిచి చంపేశాడు.
భార్య వదిలేసింది
చిత్తూరు నగరం మంగసముద్రానికి చెందిన క్రాంతి అనే యువకుడ్ని తల్లి బాగా చదివించింది. ఉద్యోగం అవసరం లేదని.. ఉన్న ఆస్తితో జీవించవచ్చని కొడుక్కిపెళ్లి చేసింది. అప్పటికే మద్యానికి బానిసైన అతడు తరచూ భార్య, తల్లిని డబ్బులకోసం వేధించేవాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో పోలీసులు అతడిని జైలుకు పంపారు. దాంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కొడుకు మీద బాధతో తల్లి అనారోగ్యం పాలై ఆరేడు నెలల కిందట చనిపోయింది. ప్రస్తుతం అతడు ఒంటరివాడయ్యాడు. రోడ్లపై పిచ్చోడిలా తిరుగుతున్నాడు.
- మద్యం, డ్రగ్స్, గంజాయి.. ఇలా మత్తుకు బానిసై జీవితాలు చిత్తు చేసుకున్న వారెందరో? ఒక్కొక్కరి జీవితం.. ఒక్కోలా నాశనమవుతోంది. ఇకనైనా మత్తుతో జీవితాలు నాశనం చేసుకున్న వారి జాబితాలో చేరకుండా యువత జాగ్రత్త పడాలి.
చిత్తూరు అర్బన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం మత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఏటా 50 నుంచి 60 శాతం ప్రమాదాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. మత్తులో విచక్షణ కోల్పోతుండటంతో చిన్న చిన్న గొడవలు కూడా తీవ్రంగా మారి హత్యలకు దారి తీస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. బంధువులు, స్నేహితులు, తమతో పనిచేసే వారితో సరదాగా మొదలయ్యే ఈ వ్యసనం జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. కళాశాల స్థాయి నుంచే యువత కూడా మద్యానికి బానిసవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు మూడేళ్లుగా చాపకింద నీరులా డ్రగ్స్, గంజాయి విస్తరిస్తోంది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈగల్ టీం సభ్యులు పోలీసులను సమన్వయం చేసుకుని పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో పలువురు విద్యార్థులు వీటికి అలవాటు పడ్డారు.
మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలు
మద్యం తాగడం వల్ల ఆలోచనాశక్తి తగ్గుతుంది. మెదడులో నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆ మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నదానిని కూడా పెద్దది చేసుకుని ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఒక్కోసారి ఈ ఘర్షణలు మరీ ఎక్కువై దాడులు, హత్యల వరకు వెళుతున్నాయి. రోజూ తాగడంతో కుటుంబ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు భార్యా పిల్లలను హింసించడం, కొట్టడం చేస్తారు. దాంతో పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. కొంత మంది భర్త వేఽధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిపోవడం లేదా భర్తతో తెగతెంపులు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. అధిక మద్యపానం వల్ల మెదడు, కాలేయం, గుండె మెదడు వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. దీంతో మానసిక ఒత్తిడితో పాటు జ్ఞాపకశక్తి తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
మద్యం కేసుల్లో రూ.10కోట్ల జరిమానా
జిల్లాలో మద్యం తాగేవారి సంఖ్య ఎంత ఎక్కువ ఉందనేందుకు డ్రంకెన్ డ్రైవ్ కేసులే నిదర్శనం. మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారికి కోర్టుకు రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తోంది. కొంత మందిని కోర్టు ఆవరణలో, గేటు ముందు రోజంతా నిలబడేటట్లు శిక్ష వేస్తున్నారు. ఇక, పట్టుబడని వారు మరెందరో?
2023లో 6,248 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.3.12 కోట్ల జరిమానా విధించారు.
2024లో 2,253 మందిపై కేసులు నమోదు చేయగా కోర్టు వారికి రూ.2.25 కోట్ల జరిమానా చెల్లించారు.
2025లో 2,435 మంది పట్టుబడగా రూ.2.43 కోట్ల జరిమానా విధించారు.
2026 జనవరి నుంచి ఇప్పటి వరకు 1,086 కేసులు నమోదు చేయగా రూ.1.86 కోట్ల జరిమానా విధించారు. ఈ లెక్కన నాలుగేళ్లలో 12,002 మందిపై కేసులు నమోదు చేసి రూ.10.50 కోట్ల వరకు జరిమానా విధించారు.
డ్రగ్స్ కేసులో 94 మంది అరెస్టు
2025 జూలై ఒకటి నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు 17 కేసుల్లో 65 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 59 మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉంది.
2026 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు 17 ఘటనల్లో 39 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 35 మందిని అరెస్టు చేయగా, మరో నలుగురు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలా, ఇప్పటి వరకు 94 మందిని అరెస్టు చేయగా.. మరో పది మందిని పట్టుకోవాల్సి ఉంది.
కేసుల కన్నా.. నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం
డ్రగ్స్, గంజాయి తాగేవారిపై కేసులు పెట్టడం కన్నా... వాటి వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా పాఠశాలస్థాయి నుంచి కళాశాలల విద్యార్థుల వరకు ఈగల్ టీం సభ్యులు, పోలీసులతో కలిసి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. డ్రగ్స్ వాడటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, విచక్షణ కోల్పోవడంతో ఘర్షణలకు దిగుతున్నారు. డ్రగ్స్‌ను విక్రయించి పదే పదే పోలీసులకు పట్టుబడుతున్న వారిపై ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పీడీయాక్టు పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. డ్రగ్స్, మద్యం వాడకం వల్ల వారి ఆరోగ్యాలతో పాటు వారిని నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్యబిడ్డలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.
- ఎస్.షాను, ఏఎస్పీ (ఆపరేషన్)