Share News

సర్కారు బడిలో ఏఐ పాఠాలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:45 AM

100 పాఠశాలల్లో పాల్‌ల్యాబ్స్‌ ద్వారా వినూత్న బోధన కృత్రిమ మేథ అనుసంధానంతో ట్యాబ్‌ల ద్వారా నేర్చుకుంటున్న విద్యార్థులు

సర్కారు బడిలో ఏఐ పాఠాలు
పాల్‌ ల్యాబ్‌లో పాఠాలు నేరుస్తున్న విద్యార్థులు

తిరుపతి(విద్య), ఆంధ్రజ్యోతి: చేతుల్లో ట్యాబులు. టేబుల్‌పై నోట్సు. ఒకవైపు వింటూ.. మరోవైపు విన్నది, నేర్చుకున్నది రాసుకుంటున్నారు. అర్థం కాకుంటే మరోసారి వెనక్కి వెళ్లి చూస్తున్నారు. ఇలా వీడియో.. ప్రశ్న.. విశ్లేషణ.. పునఃబోధన- విధానంలో ఏఐ అనుసంధానంతో రూపొందిన పాఠాలను నేర్చుకుంటున్నారు ప్రభుత్వ బడిలోని విద్యార్థులు.

విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. పాల్‌ ల్యాబ్స్‌ను విస్తృతం చేస్తోంది. తరగతి గదిలో విద్యార్థులందరూ ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కొందరికి పాఠం ఒక్కసారి చెబితే అర్థమవుతుంది. మరికొందరికి మరిన్ని ఉదాహరణలు కావాలి. ఈ వ్యత్యాసాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షాభియాన్‌ ద్వారా పర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌ (పాల్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. పాల్‌ల్యాబ్‌ అంటే.. ఓ ప్రయోగ శాల. ఇదొక డిజిటల్‌ అభ్యాస వేదిక. ఇక్కడ విద్యార్థుల చేతిలో ట్యాబ్‌లు మాత్రమే ఉంటాయి. ఇంటర్నెట్‌కు అనుసంధానించబడి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారితంగా ఈ ట్యాబ్‌లు పనిచేస్తాయి. ఈ విధానంలో విద్యార్థి తన సామర్థ్యం మేరకు, తన సొంత వేగంతో పాఠాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీ విద్యార్ధి అవసరాలకు తగినట్టుగా, తాను అర్థం చేసుకోగలిన స్థాయిలో ఏఐ విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తుంది. ప్రతి విద్యార్థికీ ఒక్కో ఉపాధ్యాయుడు అన్న విధంగా ఈ విధానం ఉంటుంది. ఇందులో నేర్చుకోవడమంటే కేవలం చదవడమే కాకుండా ఆయా పాఠాలకు సంబంధించి ఏఐ రూపొందించిన వీడియోలను చూస్తూ... దృశ్య సహితంగా నేర్చుకోవడం. దీనిపట్ల విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

బోధన ఎలా ఉంటుంది?

పాల్‌ ల్యాబ్‌ విధానంలో విద్యార్థి ట్యాబ్‌లో వీడియో పాఠాన్ని వీక్షిస్తాడు. అదే పాఠానికి సంబంధించి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు. ఆ సమాధానాలను ఏఐ విశ్లేషిస్తుంది. ఏమేరకు విద్యార్థి పాఠాన్ని అర్థం చేసుకున్నాడు. ఏ అంశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు అన్న విషయాలను ఏఐ విశ్లేషిస్తుంది. విద్యార్థి అర్థం చేసుకోలేకపోయిన అంశాలను మరింత సరళంగా అర్థమయ్యేలా తదుపరి వీడియోను విద్యార్థికి చూపుతుంది. ఈ విధంగా వీడియో- ప్రశ్న- విశ్లేషణ- పునః బోధన.. అనే విధానం కొనసాగుతుంది. విద్యార్థి బాగా అర్థంచేసుకుని సరైన విధంగా సమాధానాలిస్తే పాఠాన్ని తదుపరి కఠిన స్థాయికి తీసుకెళ్తుంది. వీటిన్నింటినీ పరిశీలించి విద్యార్థి స్థాయిని ఉపాధ్యాయుడు అవగాహన చేసుకునేందుకు, తద్వారా తగినవిధంగా విద్యార్థిపై శ్రద్ధ పెట్టేందుకు అవకాశం కలుగుతుంది.

వెనుకబడిన విద్యార్థులకు వరం

తరగతి గదిలో విద్యార్థులకు వారి అవగాహన స్థాయినిబట్టి బోధన ఉంటుంది. క్లాసులో అందరికీ ఒకే పద్ధతిలో చెప్పడంవల్ల గ్రాహణ శక్తి తక్కువ ఉన్న పిల్లలకు అర్థం కాకపోవచ్చు. కానీ పాల్‌ విధానంలో వెనుకబడిన విద్యార్థుల స్థాయికి తగినట్టుగా బోధన ఉండటంవల్ల ఆరికి వరంలా నిలుస్తోంది. పాల్‌ల్యాబ్స్‌ మంచి ఫలితాలను ఇస్తున్నాయని జిల్లా పాల్‌ల్యాబ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధాకర్‌నాయుడు చెప్పారు.

జిల్లాలో వంద బడుల్లో..

జిల్లాలో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు గణితం, తెలుగు, ఆంగ్లం సబ్జెక్టుల్లో పాల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 100 రెసిడెన్షియల్‌, మోడల్‌, ట్రైబర్‌ వెల్ఫేర్‌, కేజీబీవీ, పీఎంశ్రీ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పాల్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌ ఏర్పాటు, పవర్‌ ఛార్జింగ్‌ యూనిట్లకు ఒక్కో పాఠశాలకు రూ. 22,500 వరకు ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్యనుబట్టి ఒక్కో పాఠశాలకు 30 నుంచి 150 ట్యాబ్‌లు ఇచ్చారు. ఈవారంలో వివిధ పాఠశాలలకు మొత్తం 200 ట్యాబ్‌లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ట్యాబ్‌లను ఆఫ్‌లైన్‌లోనూ వినియోగించుకోవచ్చు. దీంతో ఇంటర్నెట్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లోనూ విద్యార్థుల అభ్యసనం నిలకడగా కొనసాగుతోంది. ఇలా ప్రతీ విద్యార్థి అభస్యసన, సామఽర్థ్యాల డేటా జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు చేరుతోంది.

Updated Date - Jan 08 , 2026 | 12:45 AM