23 ఏళ్ల తర్వాత..! నేడు యాదమరికి సీఎం రాక
ABN , Publish Date - May 23 , 2026 | 12:46 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం యాదమరి మండలంలో పర్యటించనున్నారు
యాదమరి, మే 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం యాదమరి మండలంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పర్యటించనుండటం ఇది రెండోసారి. మొత్తమ్మీద 23 ఏళ్ల తర్వాత చంద్రబాబు మండలానికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పీహెచ్‌సీలో ‘సంజీవని హెల్త్ ప్రాజెక్టు’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. 1989లో కర్షక పరిషత్ ఛైర్మన్‌గా చంద్రబాబు మండలంలో పర్యటించారు. 2003లో తీవ్ర కరువు నేపథ్యంలో యాదమరి మండలం జంగాలపల్లె పంచాయతీలో పశుపోషణ శిబిరాన్ని సీఎం హోదాలో చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు శనివారం మండలానికి వస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మండలంలోని 14 కండ్రిగ వద్ద హెలిపాడ్ సిద్ధం చేశారు. ఇక, ప్రజా వేదిక బహిరంగ సభ ప్రాంగణం, క్యాడర్‌తో ఏర్పాటయ్యే సమావేశాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు బలగాలతో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. టీడీపీ క్యాడర్ మీటింగ్‌కు వెయ్యి మందికే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ తదితరులు పరిశీలించారు.
ఈ సమస్యలను పరిష్కరించరూ
తమ చిరకాల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని మండలవాసులు కోరుతున్నారు.
మామిడి రైతులకు గిట్టుబాటు ధర
నుంజర్ల ప్రాజెక్టును చెరువులతో అనుసంధానం చేయడం.
నీవా నదిలో పూడికతీత పనులు చేపట్టడం.
ప్రమాదాల నివారణకు ఇరువారం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం.
సీఎం పర్యటన ఇలా..
ఉదయం 11 గంటలకు యాదమరి మండలం సంతగేటు సమీపంలోని 14 కండ్రిగ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరిక. అధికారులు, అనధికారులతో కాసేపు మాటామంతీ.
ప్రజా వేదిక ప్రాంగణంలో జరిగే సమావేశంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాల్గొంటారు.
అరగంట భోజన విరామం తర్వాత 1.35 గంటలకు యాదమరి పీహెచ్‌సీలో సంజీవని హెల్త్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కొంతసేపు వైద్యాధికారులు, రోగులతో మాట్లాడతారు.
తర్వాత సంతగేటు సమీపంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సమావేశంలో 2.20 నుంచి 3.50 గంటల చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4.00 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లికి పయనమవుతారు. మొత్తం ఐదు గంటలపాటు సీఎం పర్యటన ఉంటుంది.