డయాలసిస్ రోగులకు అదనపు పడకలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:50 AM
చిత్తూరు జిల్లా అస్పత్రిలో డయాలసిస్ రోగుల కోసం పది పడకల మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
ప్రభుతాన్ని కోరతాం: కలెక్టర్ సుమిత్‌కుమార్
చిత్తూరు అర్బన్, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లా అస్పత్రిలో డయాలసిస్ రోగుల కోసం పది పడకల మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. శనివారం. జిల్లా అస్పత్రి అభివృద్ధి కమిటీ(ఎస్‌డీహెచ్) సమావేశం నగరపాలక కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో జరిగింది. సమావేశం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు అనుమతి, అంబులెన్స్, వాచ్‌మన్లు, వివిధ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఆస్పత్రి అభివ ృద్ధికి సభ్యుల సలహాలు, సూచనలను స్వీకరించి వాటిని అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఎంపీ ల్యాడ్స్ కింద రూ.25 లక్షలు, అపోలో సహకారంతో కంప్యూటర్లను కొనుగోలు చేస్తామన్నారు. ఆస్పత్రిలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధికి ఏం కావాలో.. ఎంత నిధులు అవసరమో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కమిటీ మెంబర్లకు సూచించారు. త్వరలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి ఆస్పత్రి అభివృద్ధికి నిధులను అడుగుతామన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, అపోలో ఆస్పత్రి డాక్టర్లు రంగనాథ్, బాలరాజు, కమిటీ మెంబర్లు అరుణకుమారి, సురేష్, విజయ్‌కుమార్, రమేష్, డాక్టర్ విజయ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు జరిగిన సమావేశంలో మహాప్రస్థాన సేవల మెరుగుదల, తాగునీటి సమస్య, ఎస్‌ఎన్‌సీయూ పరికరాలు, మౌలిక వసతులు, పాత భవనాల మరమ్మతులు, ల్యాబ్, తదితర 20 అంశాలపై చర్చించారు. సమావేశంలో నిర్ణయించిన అంశాల అమలుకు వచ్చే 45 రోజుల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కమిటీ సభ్యులకు తెలిపారు.