తిరుపతి రూరల్ ఎంపీడీవోపై వేటు
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:56 AM
గెజిట్ నోటిఫికేషన్ రాకమునుపే ఎన్నికల డేటా రాజకీయ నాయకులకు చేరడంపై ఆగ్రహించిన కలెక్టర్ తిరుపతి రూరల్ మండలం ఇన్ఛార్జి ఎంపీడీవో మోతీని విధుల నుంచి తొలగిస్తూ శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.
రిజర్వేషన్ల డేటా లీక్పై కలెక్టర్ చర్యలు
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):గెజిట్ నోటిఫికేషన్ రాకమునుపే ఎన్నికల డేటా రాజకీయ నాయకులకు చేరడంపై ఆగ్రహించిన కలెక్టర్ తిరుపతి రూరల్ మండలం ఇన్ఛార్జి ఎంపీడీవో మోతీని విధుల నుంచి తొలగిస్తూ శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. బీఎన్కండ్రిగ ఎంపీడీవో కార్యాలయంలో ఏవోగా వున్న మోతి డిప్యుటేషన్పై తిరుపతి డీడీవో కార్యాలయంలో పనిచేస్తున్నారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం ఇన్ఛార్జి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ ఎన్నికలకు కలెక్టర్ వెంకటేశ్వర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆలోపే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఎన్నికల డేటాను పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో మోతి పాత్ర ఉన్నట్లు గుర్తించి విధుల నుంచి తప్పించడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్ను ఇన్చార్జి ఎంపీడీవోగా నియమించారు. రూరల్ మండల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలను పునః పరిశీలించి సరిచేసి ఆ జాబితాను కలెక్టర్కు అందజేశారు. అనంతరం పంచాయతీలకు రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ను కలెక్టర్ విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రిజర్వేషన్ల ఖరారు విషయంతో అధికారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిన మోతీని ఎన్నికల విధుల నుంచి పక్కనపెట్టామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.కాగా పద్మావతిపురంతోపాటు మరొక పంచాయతీలో కార్యదర్శిగా పనిచేసే సమయంలోనూ మోతీ నిధుల దుర్వినియోగం ఘటనపై విచారణను ఎదుర్కోవడం గమనార్హం.