చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:22 AM
చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కులవర్ధన్‌ను కర్మ వెంటాడింది. తాను ఏ విఽధంగా అయితే చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి ఊపిరితీశాడో? అలాగే నీటిలోనే తానూ ఊపిరొదిలాడు.
అన్నమయ్య/కురబలకోట/మదనపల్లె అర్బన్, ఫిబ్రవరి18 (ఆంధ్రజ్యోతి): చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కులవర్ధన్‌ను కర్మ వెంటాడింది. తాను ఏ విఽధంగా అయితే చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి ఊపిరితీశాడో? అలాగే నీటిలోనే తానూ ఊపిరొదిలాడు. పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే నలుగురు పోలీసులు బాలిక ఇంటి పరిసరాలలో విచారించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆచూకీ తెలియలేదు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులు కులవర్ధన్ ఇంటి తలుపుతట్టారు. ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి మొబైల్ ద్వారా లైట్ వేసి చూశారు. అతను పడుకుని ఉన్నాడు. అతని పక్కన మద్యం సీసాలున్నాయి. తాగి పడిపోయి ఉన్నాడని వదిలేశారు. మళ్లీ మంగళవారం ఉదయమే అతని ఇంటి తలుపు తట్టారు. తీయకపోవడంతో తలుపు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లారు. బాలిక గురించి అడగ్గా తనకు తెలియదని బుకాయించాడు. ఇంట్లో చూడటంతో నీటి డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది.
తప్పించుకుని ఆత్మహత్య
ఇంట్లో బాలిక మృతదేహం కనిపించగానే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రక్షక్ వాహనంలో పోలీ్‌సస్టేషన్‌కు తరలిస్తుండగా దూకి పరారయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు వెతకడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం ఉందని వీఆర్వో సుశ్మిత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పోలీసులు అతను కులవర్దన్‌గా అనుమానించి సమీప బంధువును పిలిపించి గుర్తించారు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుత్రికి తరలించారు.
చూడటానికి ఇష్టపడని తల్లి, చెల్లెలు
కులవర్ధన్ శవాన్ని చూసేందుకు అతని తల్లి, చెల్లెలు రాలేదు. పోస్టుమార్టం కోసం సమీప బంధువులు ఇద్దరిని పిలిపించి వాళ్లతో స్టేట్‌మెంట్ తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం అతని శవాన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఫ్రీజర్‌లో ఉంచారు. ముదివేడు పోలీసులు మదనపల్లె పట్టణంలోని పలు జనసమ్మర్ద కూడళ్లలో లుకవుట్ నోటీసులు(గుర్తుతెలియని మృతదేహం మదనపల్లె ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉందని) అతికించారు.
మొదటి నుంచీ అల్లరచిల్లరగానే...
నిందితుడి కుటుంబం 30 సంవత్సరాల క్రితం మదనపల్లెకు వచ్చింది. అతడి తండ్రి 20 సంవత్సరాల కిందట చనిపోయాడు. వికలాంగురాలైన ఒక చెల్లెలు ఉంది. కులవర్ధన్ చిన్నతనం నుంచీ అల్లరిచిల్లరగా తిరిగేవాడని స్థానికులు పేర్కొన్నారు. మద్యం, గంజాయి తాగడం ఇతరులతో గొడవ పడడం చేసేవాడని తెలిపారు. మహిళలతో సైతం పలుమార్లు గొడవపడటం, అసభ్యంగా ప్రవర్తించే వాడని చెప్పారు. జులాయిలను వెంటేసుకుని తిరుగుతూ అక్రమ దందాలకు పాల్పడే వాడని తెలిపారు. అతనిపై ఇప్పటికే దాడి కేసు నమోదై ఉంది.
చిన్నారికి కన్నీటి వీడ్కోలు
హత్యాచారానికి గురైన కడప జిల్లా వీరబల్లి మండలానికి చెందిన చిన్నారికి స్వగ్రామంలో బుధవారం ఉదయం కుటుంబసభ్యులు, బంధువుల కన్నీటి వీడ్కోలుతో అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి పోస్టుమార్టం పూర్తికాగానే చిన్నారి మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించారు. ఉదయం అంత్యక్రియలు ముగిశాయి. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ జగన్‌మోహన్‌రాజు పాల్గొని మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీళ్లతో పాటు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మహిళల కొవ్వొత్తుల ర్యాలీ
చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆ కుటుంబానికి ధైర్యం వచ్చేలా దేవుడిని ప్రార్ధించారు. మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.