ఐపీఎల్ మ్యాచ్‌కెళ్లి.. తిరిగొస్తుండగా ప్రమాదం
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:13 AM
సడన్ బ్రేక్ వేసిన లారీని వెనకనుంచి ఢీకొన్న కారు ఈ ఘటనలో ఇద్దరు కోర్టు ఉద్యోగుల మృతి మరో నలుగురికి గాయాలు
గంగవరం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఆదివారం సెలవు దినం. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ చూసొద్దామని నలుగురు స్నేహితులతో కలిసి ఇద్దరు కోర్టు ఉద్యోగులు వెళ్లారు. తిరిగొచ్చే క్రమంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవరు స్పీడ్ బ్రేకరు వద్ద సడన్ బ్రేక్ వేయడంతో, వెనకనుంచి వీరి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కోర్టు ఉద్యోగులు దుర్మరణం చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం వేకువజామున 3 గంటలకు గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ (దండపల్లె జంక్షన్) వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం కొట్టాల గ్రామానికి చెందిన పి.యుగంధర్(47) తిరుపతి 3వ ఏడీజె కోర్టులో జూనియర్ అసిస్టెంట్ (ప్రొటోకాల్ అధికారి)గా, తిరుపతికి చెందిన కె.హరీష్(35) ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించాలని అనుకున్నారు. మరో నలుగురితో కలిసి కారులో బయలుదేరారు. బెంగళూరులో ఆర్సీబీ, సీఎ్‌సకే మ్యాచ్ చూశారు. స్టేడియం ముందు ఓ హోటల్‌లో భోజనం చేసి తిరుపతికి తిరుగుప్రయాణమయ్యారు. సోమవారం తెల్లవారుజాముకు వీరి కారు వైఎస్సార్ జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ముందు వెళుతున్న లారీ స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవరు సడన్ బ్రేక్ వేశారు. వెనకే వస్తున్న కారు అదుపుతప్పి పక్కకు తిప్పడానికి ప్రయత్నించేలోపు, లారీ వెనుక కుడిపక్క నుంచి ఢీకొని రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై బోల్తాపడింది. కారులో ముందు, వెనుక సీటులో ఎడమవైపు కూర్చొని ఉన్న యుగంధర్, హరీ్‌షకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని సి.జగదీష్(26), సి.కిరణ్‌కుమార్(32), కె.గురుమూర్తి(45), రాజేష్(39) లకు గాయాలయ్యాయి. గంగవరం సీఐ రాంభూపాల్, ఎంవీఐ మధుసూదన్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్సులో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంభూపాల్ తెలిపారు.
బాధితులకు జడ్జి పరామర్శ
పలమనేరు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని, మృతుల కుటుంబాలను పరామర్శించారు. అలాగే, న్యాయశాఖ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు గోపినాథరెడ్డి, యూనియన్ నాయకులు లక్ష్మీపతియాదవ్, గణే్‌షకుమార్, జిల్లా కోర్టు సూపరింటెండెంట్ రుద్రమూర్తితోపాటు న్యాయశాఖకు చెందిన తిరుపతి, చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, పుంగనూరు, పీలేరు ఉద్యోగులు వచ్చారు.