Share News

పరిశ్రమలో ప్రమాదం

ABN , Publish Date - Oct 04 , 2026 | 01:35 AM

శనివారం ఉదయం 8 గంటల సమయం....విధుల కోసం రెండు వాహనాల్లో కార్మికులు శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ ఫ్యాక్టరీకి వచ్చారు. వాహనాల నుంచి దిగుతున్నంతలోనే ఫ్యాక్టరీ లోపలనుంచి భారీ శబ్దం. ఆ వెంటనే కమ్ముకున్న నల్లటి పొగ.... ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాక అందరిలోనూ భయాందోళన....శబ్దం బాయిలర్‌ పేలడం వల్ల వచ్చిందని తెలిశాక బాయిలర్‌ ఉన్న భవనం వైపు చూస్తే అది నేలమట్టమై కనిపించింది.బాయిలర్‌, భవన శకలాలు కొంతదూరం ఎగసి పడి ఉన్నాయి.ఆర్తనాదాలు వినిపించడంతో లోపల తమ సహచరులు ప్రమాదంలో చిక్కుకున్నారని అర్థమవడంతో వారిని కాపాడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ ముగ్గురూ కూడా మృత్యువాత పడ్డారు. మృతులు వీరే

 పరిశ్రమలో ప్రమాదం

-బాయిలర్‌ పేలుడుకు ఐదుగురి బలి

శనివారం ఉదయం 8 గంటల సమయం....విధుల కోసం రెండు వాహనాల్లో కార్మికులు శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ ఫ్యాక్టరీకి వచ్చారు. వాహనాల నుంచి దిగుతున్నంతలోనే ఫ్యాక్టరీ లోపలనుంచి భారీ శబ్దం. ఆ వెంటనే కమ్ముకున్న నల్లటి పొగ.... ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాక అందరిలోనూ భయాందోళన....శబ్దం బాయిలర్‌ పేలడం వల్ల వచ్చిందని తెలిశాక బాయిలర్‌ ఉన్న భవనం వైపు చూస్తే అది నేలమట్టమై కనిపించింది.బాయిలర్‌, భవన శకలాలు కొంతదూరం ఎగసి పడి ఉన్నాయి.ఆర్తనాదాలు వినిపించడంతో లోపల తమ సహచరులు ప్రమాదంలో చిక్కుకున్నారని అర్థమవడంతో వారిని కాపాడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ ముగ్గురూ కూడా మృత్యువాత పడ్డారు.

మృతులు వీరే

పశ్చిమబెంగాల్‌కు చెందిన చెందిన గౌరబ్‌రాయ్‌ (ఆర్‌వో ప్లాంటు ఇన్‌చార్జి), తమిళనాడు రాష్ట్రం నాయుడుకుప్పానికి చెందిన మోహన్‌రాజు(ఎలక్ర్టీషియన్‌), సత్యవేడు మండలం చెరివికి చెందిన చిన్న మస్తాన్‌(ఈటీపీ ఆపరేటర్‌), తమిళనాడు మాదరపాక్కానికి చెందిన రమే్‌ష(బాయిలర్‌ ఆపరేటర్‌ హెల్పర్‌), తడకు చెందిన వాసు(బాయిలర్‌ ఆపరేటర్‌)

ముందు రోజు సెలవు బతికించింది

శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ ఫ్యాక్టరీకి గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు దినం. ఒకవేళ ఈ సెలవు లేకుంటే ఇంకెంతమంది ప్రాణాలు పోయిండేవోనని కార్మికులు భయాందోళన వ్యక్తం చేశారు. సెలవు లేకుంటే నైట్‌ షిఫ్టులో కార్మికులు పనిచేస్తుండేవారు. సరిగ్గా శనివారం ఉదయం వీరు డ్యూటీ దిగే సమయానికి బాయిలర్‌ పేలింది. అంటే నైట్‌ షిఫ్టు ఉండి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేది.

భారీ శబ్దం, నల్లటి పొగ కమ్మేసింది

తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున అందజేసిన శ్రీసిటీ ఎండీ

బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున కలెక్టర్‌ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా చెక్కులను శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అందజేశారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్‌

టిల్‌ హెల్త్‌కేర్‌ ఫ్యాక్టరీలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ స్పష్టం చేశారు. ప్రమాదం విషయం తెలియగానే ఎస్పీ సుబ్బరాయుడు, పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అత్యవసర స్పందన బృందాలు, స్థానిక అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమలోని రెండు టన్నుల సామర్థ్యం ఉన్న బాయిలర్‌ పేలడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. మృతుల పిల్లల చదువుకయ్యే ఖర్చులను శ్రీసిటీ యాజమాన్యమే భరిస్తుందన్నారు. అర్హులైన కుటుంబీకులకు శ్రీసిటీ, పరిసర పరిశ్రమల్లో తక్షణమే ఉద్యోగావకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రిలిమినరీ కేస్‌ నమోదుతోపాటు బాయిరల్‌, ఫ్యాక్టరీస్‌, ఇండస్ట్రీస్‌, పోలీసుశాఖల ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. విచారణ తర్వాత నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేశామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పరిశ్రమల్లోనూ వెంటనే థర్ట్‌ పార్టీ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశాలిచ్చామన్నారు. టిల్‌ హెల్త్‌కేర్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మృతి చెందిన సహచరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై చేపట్టే విచారణకు తమ సంస్థ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన శ్రీసిటీ సమాజం మొత్తానికి బాధాకరమన్నారు. తమ 18 ఏళ్ల ప్రస్థానంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన బాయిలర్‌ ప్రమాదం తర్వాత ఇక్కడ సమగ్ర భద్రతా ఆడిట్‌లు నిర్వహిస్తూ.. నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని.. అయినా ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 01:35 AM