Share News

రక్షిత రహదారితో ప్రమాదాల నియంత్రణ

ABN , Publish Date - May 09 , 2026 | 01:43 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న రక్షిత రహదారి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని అన్నమయ్య కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ తెలిపారు. అమరావతిలో శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజైన శుక్రవారం వారు రక్షిత రహదారిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేన్‌ ఇచ్చారు.

రక్షిత రహదారితో ప్రమాదాల నియంత్రణ
సీఎంతో కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌

తాగునీటి కొరత, జలధార, పీఎం సూర్యఘర్‌పై చర్చ

అన్నమయ్య, మే 8(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న రక్షిత రహదారి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ తెలిపారు. అమరావతిలో శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజైన శుక్రవారం వారు రక్షిత రహదారిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేన్‌ ఇచ్చారు. వేసవిలో తాగునీటి కొరత, జలధార పథకం ప్రభావం, ఇండస్ర్టియల్‌ పార్క్‌, పీఎం సూర్యఘర్‌ వంటి అంశాలూ చర్చకు వచ్చాయి. జలధార ప్రాజెక్టు వల్ల జిల్లాలో గొప్ప అభివృద్ధి జరిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక పార్కు కోసం మరిన్ని భూములు సేకరించాలని సూచించారు.

రక్షిత రహదారితో సత్ఫలితాలు

జిల్లాలో 70 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయని గుర్తించి రక్షిత రహదారి కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో హెల్మెట్‌, సీటు బెల్ట్‌, సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అధిక వేగం, డ్రంకెన్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై చలానాలు విధించినట్లు తెలిపారు. అవసరమైన చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు, స్ర్టిప్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు వచ్చినట్లు వివరించారు.

0.1 శాతం తగ్గిన సంతృప్తి

గత సమావేశంతో పోల్చితే పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌(సంతృప్తి) 0.1 శాతం తగ్గింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 26వ తేదీ వరకు లెక్కలు తీయగా తీశారు. రీసర్వే, అన్న క్యాంటీన్‌, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌, గంజాయి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

477 పోస్టుల భర్తీకి ఆదేశాలు

జిల్లాలో 453 అంగన్వాడీ పోస్టులు, ఎస్‌ఏఏ పోస్టు 1, చిల్డ్రన్‌హోమ్స్‌ 5, ఓఎస్‌సీ 18 మొత్తం 477 పోస్టులు మే 26వ తేదీలోగా భర్తీ చేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. పెండింగ్‌ మరుగుదొడ్లు, తాగునీటి పథకాల పనులను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. పల్లె పండుగ పథకంలో చేపట్టిన పనులపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఆవాసయోజన పథకం కింద 80శాతం లక్ష్యం పూర్తయినట్లు కలెక్టర్‌ వివరించారు. పీజీఆర్‌ఎస్‌ వినతుల పరిష్కారంలో ప్రజలు 78శాతం సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 30 గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పీఎం సూర్యఘర్‌లో మరింత పురోగతి అవసరమని సీఎం పేర్కొన్నారు.

Updated Date - May 09 , 2026 | 01:43 AM