భూసేకరణ పనులను వేగవంతం చేయండి
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:54 AM
జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తిరుపతి(కలెక్టరేట్), జూలై 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ ఫేజ్-2, ఏపీఐఐసీలోని ఎల్‌జీ ఫేజ్ 1, 2, 3, శ్రీసిటీ ఫేజ్ 1, 2, 3, 4, నాయుడుపేట ఫేజ్ 2, వానెల్లూరు, పాగాలి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్ కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని,వెబ్‌ల్యాండ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు, వీసీఐసీ రోడ్డు, ఏపీఐఐసీ ప్రాజెక్టు, వైజాగ్ చెన్నై కారిడర్ పైపులైను పనులు, రైల్వేప్రాజెక్టు పనులు, పురోగతిలో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి, ఏర్పేడు - పూడి, గుమ్మడిపూండి - గూడూరు, గూడూరు - రేణిగుంట, పాకాల - తిరుపతి, తిరుపతి - కాట్పాడి, ఆరక్కోణం - రేణిగుంట రూట్లకు సంబంధించిన రైల్వేప్రాజెక్టు పనులను వేగవంతం చేయలన్నారు. నాయుడుపేట - రేణిగుంట, రేణిగుంట - కడప, రేణిగుంట నుంచి చెన్నై జాతీయ రహదారి, సాగరమాల కింద చేపట్టిన పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. అలాగే ఎయిర్‌పోర్టు, కరకంబాడి, ఎంఐజీ లేఅవుట్, తిమ్మాజికండ్రిగ పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేసీ గోవిందరావు,ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకా్‌షరెడ్డి, దేవేంద్రరెడ్డి, ఏపీఐఐసీ జడ్‌ఎం విజయ్‌భరత్‌రెడ్డి, జిల్లా ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్సు అధికారి శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.