Share News

టీటీడీ డిప్యూటీ ఈవో ఆస్తులపై ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:21 AM

శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం టీటీడీలో చర్చనీయాంశంగా మారింది.

 టీటీడీ డిప్యూటీ ఈవో  ఆస్తులపై ఏసీబీ సోదాలు
లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు - బయటపడ్డ ఆభరణాలు

శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం టీటీడీలో చర్చనీయాంశంగా మారింది.ఈవో, అదనపు ఈవో తర్వాత ఆ స్థాయిలో కీలకమైన స్థానం తిరుమల డిప్యూటీ ఈవోదే. ప్రముఖులు శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో ఉన్నతాధికారులతోపాటు తప్పనిసరిగా డిప్యూటీ ఈవో ఉంటారు. ఆ స్థాయి అధికారి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండడంపై టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది పలు విశ్లేషణలు చేస్తున్నారు.ఇంకా ఎవరెవరిపై దాడులు జరుగుతాయోనని ఆందోళనలో ఉన్నారు.

తిరుపతి(టీటీడీ), ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) :తిరుమల ఆలయ డిప్యూటీ ఈవోగా లోకనాథం 2023 ఏప్రిల్‌ 24 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు రెండేళ్లపాటు తిరుచానూరులోని పద్మావతీ దేవి ఆలయ డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వహించారు.వాస్తవానికి ఏడాది క్రితం ఆయన్ను తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయానికి బదిలీ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ బదిలీలను ఉన్నతాధికారులు నిలిపివేయడంతో తిరుమల ఆలయ డిప్యూటీ ఈవోగా లోకనాథం కొనసాగుతూ వచ్చారు. ఆయన ఇంట్లో బుధవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించడం పట్ల అనేక వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీలో అధికారుల నడుమ అంతర్గత విభేదాల కారణంగానే ఏసీబీ తనిఖీలు జరిగాయని వైసీపీ నేత కరుణాకర రెడ్డి ఆరోపిస్తున్నారు.అదనపు ఈవో వెంకయ్య చౌదరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు.ముఖ్యమంత్రిగా నాల్గవసారి బాధ్యతలు చేపట్టాక తిరుమల వచ్చిన చంద్రబాబు టీటీడీలో సమూల ప్రక్షాళన చేపడతామని సంకేతాలిచ్చారు. ఇందులో భాగంగానే ఏసీబీ దాడులు జరిగాయన్న వాదన అధికారుల వర్గాల్లో నడుస్తోంది.

గతంలోనూ ఏసీబీ తనిఖీలు

అవినీతి నిరోధక శాఖ అధికారులు గతంలోనూ టీటీడీ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేసి కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి. 2016 ఫిబ్రవరిలో డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న టి.భూపతిరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు అతని ఇంటిపై దాడులు నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో అప్పటి టీటీడీ రిక్రూట్‌మెంట్‌ సెల్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర సైతం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయనతోపాటు మరో సూపరింటెండెంట్‌ మోహన్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. వీరిద్దరికి సహకారం అందించాన్న ఆరోపణలపై టీటీడీ కల్యాణకట్టలో మేస్త్రీ తంగవేలు ఇంటిలోనూ సోదాలు చేశారు.అదే ఏడాది ఆగస్టులో తంగవేలు ఇంటో ఏసీబీ అధికారులు రెండవసారి తనిఖీలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టరు దగ్గర నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ అప్పటి ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేసిన రామకృష్ణారావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.మరోవైపు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు సైతం టీటీడీలో జరిగే అక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నారు. వీటి ఆదారంగా టీటీడీ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి.

Updated Date - Sep 03 , 2026 | 12:21 AM