చిత్తూరు ఎస్‌ఆర్‌లో ముగిసిన ఏసీబీ దాడులు
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:38 AM
చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్‌రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్) కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు ఏసీబీ అధికారులు దాడులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ 24 గంటలపాటు ఏసీబీ అధికారులతో పాటు ఎస్‌ఆర్ కార్యాలయ సిబ్బంది, 15 మంది డాక్యుమెంటు రైటర్లు కార్యాలయంలోనే ఉన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కుటుంబీకులు మాత్రలు తీసుకొచ్చినా అనుమతించలేదు.
రాత్రంతా కార్యాలయంలోనే సిబ్బంది, డాక్యుమెంటు రైటర్లు
- పట్టుబడ్డ నగదు రూ.1,12,730
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్‌రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్) కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు ఏసీబీ అధికారులు దాడులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ 24 గంటలపాటు ఏసీబీ అధికారులతో పాటు ఎస్‌ఆర్ కార్యాలయ సిబ్బంది, 15 మంది డాక్యుమెంటు రైటర్లు కార్యాలయంలోనే ఉన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కుటుంబీకులు మాత్రలు తీసుకొచ్చినా అనుమతించలేదు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు ఏసీబీ అధికారులు అనుమతించారు. ఇక, ఎస్‌ఆర్ కార్యాలయంలో 3-4 ఏళ్ల కిందటి సాక్ష్యాలను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్నారు. కార్యాలయంలో పనిభారం పేరిట అనధికారికంగా కొందరు పనిచేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సోమవారం ఉదయం విధులకు హాజరైన ఇన్‌చార్జి రిజిస్ట్రార్ విజయ్‌కుమార్, అటెండర్ ప్రతాప్ సాయంత్రం తాము వచ్చిన సమయంలో పరారైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంగళవారం కూడా వారు ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరవడంపై తమ దర్యాప్తు నివేదికలో నమోదు చేశారు. జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ రమణరావు మాత్రం ఆఫీసులోనే ఉన్నారు. ఈ దాడుల సందర్భంగా మొత్తం రూ.1,12,730 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో డాక్యుమెంట్ రైటర్ల వద్ద అనామత్తుగా ఉన్న రూ.79,090, కార్యాలయంలోపల వివిధ ప్రదేశాల్లో ఉన్న రూ.30,200, సిబ్బంది వద్ద రూ.4440 ఉన్నాయి. అధికారులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల సెల్‌ఫోన్లలో ఫోన్‌పే ద్వారా ఇటీవల జరిగిన నగదు బదిలీల వివరాలను పరిశీలించారు. ఇక, మంగళవారం ఉదయం కొందరు ఈసీ నకలు, రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ తదితరాలకు వచ్చిన వారిని లోపలకు అనుమతించారు. రిజిస్ట్రేషన్ భవనంలో మొదటి, రెండో అంతస్థుల్లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ కార్యాలయ సిబ్బందిని గుర్తింపు కార్డులు పరిశీలించాకే లోపలకు పంపారు.
ఇది మూడోసారి
జిల్లాలో ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చిత్తూరు ఆర్వో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఒకటి. 2016 సెప్టెంబరు 21న, అనంతరం 2018 నవంబరు 12న, తాజాగా ఇప్పుడు ఏసీబీ దాడులు నిర్వహించారు.
నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో పేర్కొన్న భూములనూ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే, కొన్ని రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వం నిర్ణయించిన విలువలను తగ్గంచడం, ఇళ్లను ఖాళీస్థలాలుగా, మూడంతస్థుల ఆస్తిని తక్కువగా, వాణిజ్య ప్రాంతాల్లో ఆస్తులను రెసిడెన్షియల్‌గా చూపించి తక్కువ ఫీజు వసూలు చేసినట్లు గుర్తించారు.
ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లపై అరెస్టు
చిత్తూరు అర్బన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీకోసం వెళ్లిన ఏసీబీ కానిస్టేబుళ్లపై దాడి చేసిన ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపిన ప్రకారం.. సోమవారం సాయంత్రం రిజిస్ర్టార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వెళ్లగా, ఓ వ్యక్తి ఎస్‌ఆర్‌కే అసోసియేట్స్ వైపు పరుగెత్తాడు. ఏసీబీ కానిస్టేబుళ్లు ధనుంజయ, లీలాప్రసాద్ అతడిని వెంబడిస్తూ వెళ్లారు. డాక్యుమెంట్ రైటర్ ఎవరని అడగ్గా, తామేనని సంపంగి రామకృష్ణ, సంపంగి సతీష్ చెబుతూ ఏసీబీ కానిస్టేబుళ్లతో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారు. ఏసీబీ సీఐ నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.