ఏసీబీ క్షేత్రస్థాయి పరిశీలన
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:42 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ చేపట్టిన తనిఖీలు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. మొదటి రోజు మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు, ఫైళ్లను పరిశీలించిన ఏసీబీ అధికారులు బుధవారం అనుమతులకు విరుద్దంగా నిర్మించిన భవన నిర్మాణాలను నేరుగా పరిశీలించారు.
ఐదు బృందాలతో రెండోరోజూ కొనసాగిన తనిఖీలు
అనుమతులకు విరుద్దంగా అంతస్థుల నిర్మాణం గుర్తింపు
నేడు నిషేధిత భూముల్లో అక్రమ నిర్మాణాలపై పరిశీలన
తిరుపతి(నేరవిభాగం/సిటీ), మార్చి 11(ఆంరఽధజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ చేపట్టిన తనిఖీలు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. మొదటి రోజు మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు, ఫైళ్లను పరిశీలించిన ఏసీబీ అధికారులు బుధవారం అనుమతులకు విరుద్దంగా నిర్మించిన భవన నిర్మాణాలను నేరుగా పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం జారీ చేసిన అనుమతుల్లో పేర్కొన్న వివరాలు, వాస్తవ నిర్మాణాల్లో ఉన్న అంతస్తులు, కొలతలను సరిపోల్చుతూ తనిఖీలు నిర్వహించారు.ఐదు భవనాల్లో అనుమతులకు మించి అంతస్తులు నిర్మించినట్లు గుర్తించారు.ఈ భవనాలకు సంబంధించిన కొలతలను తీసుకుని రికార్డుల్లో పేర్కొన్న పరిమాణాలతో సరిపోల్చి పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.ఈ తనిఖీలను ఏఎస్పీ విమల కుమారి ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి ఐదుచోట్ల ఏకకాలంలో నిర్వహించారు. అదనపు ఎస్పీ విమలకుమారి తోపాటు ఏసీబీ ఇన్స్‌పెక్టర్లు మల్లిఖార్జున, నరసింహారావు, వెంకటరమణ, విద్యాసాగర్‌రావు నేతృత్వంలోని బృందాలు ఈ క్షేత్రస్థాయి తనిఖీల్లో పాల్గొన్నాయి.గురువారం కూడా తనిఖీలు కొనసాగనున్నాయి. గురువారం మరికొన్ని అక్రమ భవనాలను ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.ముఖ్యంగా నిషేధిత భూముల జాబితా (22ఎ)లో ఉన్న భూముల్లో జరిగిన అక్రమ నిర్మాణాలను పరిశీలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
భవన నిర్మాణాల్లో గుర్తించిన అక్రమాలివే
ఫ బైరాగిపట్టెడలో పి. నాగరాజుకు చెందిన బన్సల్ క్లాసెస్ భవనానికి పార్కింగ్‌తో పాటు రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని అదనంగా మూడు అంతస్తులు, పెంట్ హౌస్ నిర్మించారు.ఫ శివసుబ్రహ్మణ్య ప్రసాద్‌కు చెందిన సోక్రటీస్ పాఠశాల భవనానికి పార్కింగ్‌తోపాటు మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని అదనంగా రెండు అంతస్తులు నిర్మించారు.ఫ అన్నారావు సర్కిల్ వద్ద ఎం. భక్తవత్సలరావుకు చెందిన భవనానికి పార్కింగ్‌తోపాటు మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని అదనంగా రెండు అంతస్తులు నిర్మిస్తున్నట్లు గుర్తించారు.ఫ లీలామహల్ సర్కిల్ సమీపంలో పి. వాసుదేవరెడ్డికి చెందిన రాక్‌ఫిల్లర్ హోటల్ భవనానికి పార్కింగ్‌తోపాటు ఐదు అంతస్తులకు అనుమతి తీసుకుని అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నట్లు గుర్తించారు.ఫమంగళం రోడ్డులోని డీమార్ట్ సమీపంలో రఘువీర షిలాయ్‌కు చెందిన భవనానికి పార్కింగ్‌తోపాటు మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని అదనంగా రెండు అంతస్తులు నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.