అశ్రునయనాలతో జగన్‌కు అంతిమ వీడ్కోలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:39 AM
వి.కోటలో మంగళవారం హత్యకు గురైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరిగాయి. చివరిసారిగా చూసేందుకు జనం తరలివచ్చారు.
రామకుప్పం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): వి.కోటలో మంగళవారం హత్యకు గురైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరిగాయి. చివరిసారిగా చూసేందుకు జనం తరలివచ్చారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు వి.కోటకు చేరుకుని జగన్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సతీమణి రేణుకారెడ్డి జగన్మోహన్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని, తామంతా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జగన్‌తో పాటు వాకింగ్‌కు వెళుతూ.. హత్య సమయంలో గాయపడ్డ ప్రజాశక్తి విలేకరి మణిని ఆమె పరామర్శించారు. హత్యోదంతాన్ని ఆయన వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. జగన్మోహన్‌రెడ్డి హత్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని రేణుకారెడ్డి కోరారు. టీడీపీ నేతలు రామచంద్రనాయుడు, రంగనాథ్, రాంబాబు, ధీరజ్, నారాయణస్వామి, మురుగేష్, శబరీష్, హరి, వైసీపీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి పీఎన్ నాగరాజు, జడ్పీచైర్మెన్ శ్రీనివాసులు, బీజేపీ నేత మైందల రామచంద్రనాయుడుతో పాటు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు జగన్మోహన్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 2గంటలకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. భార్య గీతాంజలి, కుమార్తె భావన, కుమారుడు యతీ్‌షరెడ్డి, తల్లిదండ్రులు ఉమామహేశ్వరి, ఎల్లారెడ్డి, మామ గోవిందరెడ్డి, తోబుట్టువులు జగన్‌కు అంతిమ నివాళులర్పించారు. వారి రోదనతో ఆ ప్రాంతం విషాదంతో నిండిపోయింది. అఖిలపక్షంలోని ప్రముఖనేతలు జగన్ పాడె మోశారు. మధ్యాహ్నం 3గంటలకు వి.కోట శివారులోని శ్మశానంలో మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.
హోంమంత్రి అనిత పరామర్శ
జగన్మోహన్‌రెడ్డి సతీమణి గీతాంజలితో హోంమంత్రి అనిత బుధవారం ఫోన్లో మాట్లాడారు. హత్య పట్ల ఆమె సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారని మంత్రి తెలిపారు. ఽధైర్యంగా ఉండాలని, హంతకుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని తగురీతిన ఆదుకుంటామని చెప్పారు. అంతకు ముందు ఫోన్లో గీతాంజలిని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పరామర్శించారు. దురదృష్ట సంఘటన జరిగిందని, ధ్యైర్యంగా ఉండాలని సూచించారు. తామంతా వెంట ఉన్నామని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
నిందితులను కఠినంగా శిక్షించండి
జగన్మోహన్‌రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వి.కోటకు చెందిన ముస్లిం పెద్దలు కోరారు. వీరు బుధవారం సాయంత్రం పోలీసు స్టేషన్‌లో అదనపు ఎస్పీ రాజశేఖర్‌రాజు, ఇతర పోలీసు అధికారులను కలిశారు. నిందితులతో తమకు సంబంధం లేదని, వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న వి.కోటలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నదే తమ అభిమతమన్నారు. వి.కోటలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు అందరూ సహకరించాలని ఏఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రభాకర్, సీఐ సోమశేఖర్, ముస్లిం పెద్దలు సలాంసాబ్, అక్మల్, జఫరుల్లా తదితరులు పాల్గొన్నారు.