టమోటా రైతుకు గ్రహపాటు
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:18 AM
ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రత తగ్గిన కాయ సైజు, దిగుబడి
సోమల, ఆంధ్రజ్యోతి: ఎల్‌నినో ప్రభావం.. అధిక ఉష్ణోగ్రత టమోటా రైతుల పాలిట శాపంగా మారింది. ఎండల తీవ్రతతో దిగుబడులు భారీగా తగ్గాయి. టమోటా ధరలు ఆశాజనకంగా ఉన్నా దిగుబడులు లేక రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మార్చి నెలలో నాట్లు వేసిన పొలాల నుంచి టమోటా దిగుబడులు వస్తున్నాయి. అయితే కాయలు గోలీ కాయ సైజులో ఉంటున్నాయి. దీంతో 15కిలోల బాక్సు కొన్ని రోజులుగా రూ.500 - 600 మధ్య పలికింది. హెచ్చు తగ్గులున్నా రూ.400 స్థిరంగా వస్తోంది. కానీ ఎండల వేడికి ఎర్ర నల్లి, బూడిద తెగులు, పలు రకాల వైరస్‌లతో తోటలు దెబ్బతింటున్నాయి. రూ.వేలకు వేలు వ్యయం చేస్తూ మందులు పిచికారీ చేస్తున్నా చీడలు పోవడం లేదు. రోజు మార్చి రోజు మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండటం లేదు. ఎకరాలో సాధారణంగా 15 కిలోల బాక్సులు 1500 వచ్చేవి. ప్రస్తుతం 800 బాక్సులకు మించడం లేదు. ఎండ తీవ్రతతో చెట్టు ఏపుగా పెరగడం లేదు. గత దిగుబడుల్లో 50శాతం మాత్రమే కోతలు వస్తున్నాయి. సోమల మండలంలో 3వేల ఎకరాల్లో టమోటా సాగు ఉంది. మండలంలోకి కలకడ, మహల్, కోన, మదనపల్లె, చిన్నమండ్యం తదితర ప్రాంతాల వలస రైతులు ఎకరా రూ.40 వేలనుంచి రూ.50 వేలతో భూములు లీజుకు తీసుకుని పంట సాగు చేశారు. ఎకరాకు రూ.2లక్షలు మించి ఖర్చు చేశారు. ఎండల తీవ్రతతో పంటల్లేక అల్లాడుతున్నారు. దిగుబడులు సాధించడానికి విచ్చలవిడగా మందులు పిచికారీ చేస్తున్నారు. ఫలితం కానరావడం లేదు. జూన్‌లో వర్షాలు వచ్చి వాతావరణం చల్లబడి దిగుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశ మిగిలింది. ఎండల తీవ్రతతో తోటలు దెబ్బతింటున్నాయి.